కేసీఆర్‌పై దత్తన్న ఆగ్రహం దేనికో?

May 10, 2019


img

కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ చెపుతున్నప్పటికీ ఆయన కాంగ్రెస్‌ మిత్రపక్షాలను చీల్చి నరేంద్రమోడీకి మద్దతు కూడగట్టడానికే తెరపైకి ఆ ప్రతిపాదన తెచ్చారని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. బహుశః అందువల్లనేనేమో ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఏనాడూ కేసీఆర్‌ చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాల గురించి మాట్లాడలేదనుకోవచ్చు. 

కానీ ఆయన కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఈయవచ్చునని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల ప్రభావం అప్పుడే రాష్ట్ర బిజెపి నేతలపై పడినట్లే ఉంది. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇంతవరకు తెరాస నేతలు ఎవరూ స్పందించకపోయినా, గత నాలుగేళ్ళుగా కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు. 

ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నానని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కూడా అదే వైఖరికి కట్టుబడి ఉంటారా? ఎటువైపు అవకాశం ఉంటే అటువైపు దూకే గోడ మీద పిల్లిలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. ఇంటర్ అవకతవకలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లకు ఫిర్యాదు చేయనున్నాము. కేసీఆర్‌ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యాయాన్ని రూ.39,000 కోట్ల నుంచి రూ.52,000 కోట్లు పెంచేసి భారీ అవినీతికి పాల్పడింది. ఆ ప్రాజెక్టుకు సబందించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును బయటపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.

కేసీఆర్‌ కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఈయవచ్చుననే ఊహాగానాలు వినిపించగానే దత్తన్న ఈవిధంగా స్పందించడం గమనిస్తే బిజెపిలో ఆందోళన మొదలైనట్లే కనిపిస్తోంది. 


Related Post