అవును కేసీఆర్‌ నుంచి ఆహ్వానం వచ్చింది: జగ్గారెడ్డి

May 09, 2019


img

తెరాసలోకి వెళ్లడానికి సిద్దంగా ఉన్న సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతున్న మాటలు తన స్థాయిని అతిగా ఊహించుకొని మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తరువాత కేసీఆర్‌ కాంగ్రెస్‌ పంచన చేరే అవకాశం ఉందని ప్రకటించి కలకలం సృష్టించినా జగ్గారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ, “అవును కేసీఆర్‌, కేటీఆర్‌ బందువుల ద్వారా నాకు తెరాసలోకి ఆహ్వానం వచ్చింది. నేను గాంధీభవన్‌లో ఉంటానో లేక తెలంగాణ భవన్‌లో ఉంటానో మే నెలాఖరులోగా కాలమే నిర్ణయిస్తుంది. అయితే నా అంతట నేను తెరాసలోకి వెళ్లాలని ఎటువంటి ప్రయత్నం చేయలేదు. నేను ఏదో ఓ పార్టీ జెండా నీడన ఎదిగిన వాడిని కాను స్వశక్తితో ఎదిగిన వాడిని. కనుక ఏ పార్టీ అయినా నా వంటి బలమైన నాయకుడు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. నేను ఏ పార్టీలో ఉన్నా దాని కోసమే నిబద్దతతో పనిచేస్తాను. కానీ పార్టీ చెప్పినదానిలో సగమే వింటాను. మిగిలిన 50 శాతం నా స్వంత నిర్ణయాలు తీసుకొంటాను. రాష్ట్ర విభజన వలన తెలంగాణకు ఏమి మేలు జరిగిందో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పగలను. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్టకడుతుంది లేకుంటే ప్రమాదమే,” అని అన్నారు.

జగ్గారెడ్డి స్వశక్తితో ఎదిగిన నేతే కావచ్చు కానీ ఏదో ఒక పార్టీ జెండా లేకుండా ఏ రాజకీయ నాయకుడికి ఇంత గుర్తింపు లభించదు. దానికి ఆయన కూడా అతీతుడు కారు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత కూడా చాలా బేలగా మాట్లాడిన జగ్గారెడ్డి ఇప్పుడు తన రాకకోసం కేసీఆర్‌, కేటీఆర్‌ ఎదురు చూస్తున్నారన్నట్లు మాట్లాడటం అతిశయమేనని చెప్పవచ్చు. 5 కోట్ల మంది ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొంటే దాని వలన వారికి ఏమి ప్రయోజనం కలిగిందని జగ్గారెడ్డి ప్రశ్నించడం వారి పోరాటాలను అవమానించడమే. తెలంగాణలో గత 5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధిని చూసి యావత్ దేశమూ ప్రశంసిస్తుంటే తెలంగాణ నడిబొడ్డున నివాసం ఉంటున్న జగ్గారెడ్డికి మాత్రం అది కనబడకపోవడం విడ్డూరంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్ర కాంగ్రెస్‌కు బలం చేకూరుతుంది కనుక కాంగ్రెస్ పార్టీలో ఉండాలని, అలాకాని పక్షంలో తన రాజకీయ భవిష్యత్ కాపాడుకోవడం కోసం తెరాసలోకి వెళ్లాలనుకొంటున్నానని జగ్గారెడ్డి చెప్పకనే చెపుతున్నారు. పార్టీ అధిష్టానం చెప్పిన మాటను పూర్తిగా పాటించే అలవాటు లేదని గొప్పగా చెప్పుకొంటున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎందుకు భరిస్తోందో తెరాస ఎందుకు ఆహ్వానించాలనుకొంటోందో వాటికే తెలియాలి.  



Related Post