వాటీజ్ దిస్ జగ్గారెడ్డి? విజయశాంతి

May 08, 2019


img

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సీనియర్ కాంగ్రెస్‌ నేత విజయశాంతి తీవ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. సిఎం కేసీఆర్‌, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముగ్గురూ కూడా యూపీయే ప్రభుత్వానికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. తెరాస యూపీయే ప్రభుత్వంలో చేరినా ఆశ్చర్యం లేదు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని చాలా చక్కగా నడిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆయన టికెట్లు అమ్ముకొన్నారనే ఆరోపణలలో నిజం లేదు. నిజానికి ఎన్నికలలో ఆయనే ఆర్ధికంగా దెబ్బ తిన్నారు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన తన పదవిలో నుంచి దిగిపోతే రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి సోదరులు, శ్రీధర్‌ బాబు వంటి అనేకమంది సమర్ధులైన నాయకులు ఉన్నారు,” అని అన్నారు.

తెరాసలో చేరే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొంటున్న జగ్గారెడ్డి ఈవిదంగా మాట్లాడటం ఆశ్చర్యకరమే. ఆయన కేసీఆర్‌ సూచనల మేరకే ఈవిదంగా మాట్లాడేరేమోనని సీనియర్ కాంగ్రెస్‌ నేత విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు. తద్వారా పార్టీ విశ్వసనీయతను దెబ్బ తీసి పరిషత్, పురపాలక ఎన్నికలలో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క స్థానిక ఎన్నికలలో గెలుపుకోసం కాంగ్రెస్ నేతలందరూ తీవ్రంగా కృషి చేస్తుంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈవిదంగా మాట్లాడటం అనుమానం కలిగిస్తోందని అన్నారు. యూపీయేలో కేసీఆర్‌ చేరుతారని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌కు బదులు తెరాసకు ఓట్లు వేస్తే మంచిదనే భావన ప్రజలలో కలిగించేందుకు జగ్గారెడ్డి వ్యాఖ్యలు దోహహదపడతాయని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి నష్టం కలిగించేవిదంగా మాట్లాడటం సరికాదని విజయశాంతి అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ మద్దతు లేనిదే ఈసారి కాంగ్రెస్‌, బిజెపిలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని కేసీఆర్‌ వాదననే జగ్గారెడ్డి వినిపిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. 

విజయశాంతి వాదన సహేతుకమైనదేనని అర్ధం అవుతోంది. తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే భావన ప్రజలలో బలంగా ఉన్నందునే రాష్ట్రంలో బిజెపి విశ్వసనీయత దెబ్బ తిని అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా తెరాసలో చేరిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ప్రయోజనం ఉందనే భావన ప్రజలలో నెలకొని ఉంది. ఇటువంటి సమయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలకు కాంగ్రెస్‌పై మరింత అనుమానం కలిగించే ప్రమాదం ఉంది. కాంగ్రెస్‌లో ఉంటూ పిసిసి అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగిపోతే పార్టీలో చాలా మంది సమర్దులు ఉన్నారని చెప్పడం పార్టీలో నేతల మద్య చిచ్చుపెట్టే ప్రయత్నంగానే కనిపిస్తోంది. అదే...తెరాసలో ఎవరైనా ‘కేసీఆర్‌ దిగిపోతే పార్టీ బాధ్యతలను, సిఎం పదవి చేపట్టడానికి పార్టీలో చాలా మంది సమర్దులున్నారని చెప్పే సాహసం చేయగలరా?’ అని ఆలోచిస్తే జగ్గారెడ్డి తన పరిదిని ఎంతగా అతిక్రమించి మాట్లాడారో అర్ధం చేసుకోవచ్చు. ఈవిషయం విజయశాంతి బాగానే గ్రహించారు కనుకనే ఈవిదంగా స్పందించారు. కనుక జగ్గారెడ్డి వలన పార్టీకి నష్టం జరుగక ముందే కాంగ్రెస్ పార్టీ మేలుకొంటే మంచిదేమో?


Related Post