కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం: కోమటిరెడ్డి

May 07, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులా అవినీతిపై విచారణ జరిపించి జైలుకు పంపిస్తాము. రానున్న ఆరు నెలలలో తెరాస ప్రభుత్వం కూలిపోవడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్‌ జెండాలు రెపరెపలాడటం తధ్యం. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకొంటున్న కేసీఆర్‌ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది. గ్రామపంచాయతీలకు నిధులు విడుదల కాకపోవడంతో గ్రామీణ వ్యవస్థలు స్తంభించిపోతున్నాయి,” అని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికల తరువాత తెరాస భరతం పడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ హెచ్చరిస్తుండగా, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ ప్రభుత్వం కూల్చివేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిస్తుండటం గమనిస్తే ఆ రెండు పార్టీలు తెరాసపై ఎంతగా రగిలిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తునందున రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌పై ఆగ్రహం కలిగి ఉండటం సహజమే. 

గత 5 ఏళ్ళలో సిఎం కేసీఆర్‌ రాష్ట్ర బిజెపిని పట్టించుకోనప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో బలమైన స్నేహసంబందాలు నెరుపుతూ రాష్ట్రంలో బిజెపిపై ప్రజలలో అపనమ్మకం కలిగేలా చేసి దాని విశ్వసనీయతను దెబ్బ తీషారు. తత్ఫలితంగానే ప్రతీ ఎన్నికలలో బిజెపిని ఓడిపోతోందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో 117 స్థానాలకు పోటీ చేసి ఒకే ఒక స్థానంలో గెలవడమే అందుకు తాజా ఉదాహరణ. కనుక తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బ తీస్తున్న కేసీఆర్‌పై రాష్ట్ర బిజెపి నేతలు ఆగ్రహం కలిగి ఉండటం సహజమే. 

ఒకవేళ కేంద్రంలో బిజెపి మళ్ళీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినట్లయితే, ఈసారి రాష్ట్ర బిజెపి నేతలు తెరాసను గట్టిగా డ్డీకొనవచ్చు. ఒకవేళ తెరాస మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైతే మళ్ళీ మౌనం వహించకతప్పదు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెపుతున్నట్లు తెరాసకు కొత్త కష్టాలు మొదలవవచ్చు. కనుక ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంపై ఎంతో కొంత ప్రభావం చూపవచ్చు. 


Related Post