కేసీఆర్‌-స్టాలిన్ భేటీ రద్దు?

May 07, 2019


img

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఈనెల 13న సిఎం కేసీఆర్‌ చెన్నై వెళ్ళి డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌తో భేటీ అవ్వాలనుకొన్నారు. కానీ లోక్‌సభ ఎన్నికల హడావుడిలో ఉన్నందున ఆరోజున కలిసే అవకాశం లేదని డిఎంకె పార్టీ తెలియజేసినట్లు తాజా సమాచారం. లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె-కాంగ్రెస్‌ పార్టీలు పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌తో సమావేశం అవడం వలన కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందటుంది. ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది కనుకనే ఎన్నికల హడావుడి పేరుతో కేసీఆర్‌తో భేటీని రద్దుచేసుకొని ఉండవచ్చు. కానీ మే 19న చివరి దశ ఎన్నికల హడావుడి కూడా ముగిసిన తరువాతైనా కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్ అంగీకరిస్తారో లేదో చూడాలి. 

అప్పటికి ఎన్నికల ఫలితాలు వెలువడటానికి కేవలం 4 రోజులు సమయం మాత్రమే ఉంటుంది. ఆలోగా సిఎం కేసీఆర్‌ ఎన్ని పార్టీల మద్దతు కూడగట్టగలరో చూడాలి. దేశంలోకెల్లా అత్యధిక ఎంపీ సీట్లు (80) ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ-బీఎస్పీలు పొత్తులు పెట్టుకొన్నాయి. వాటిలో బీఎస్పీ అధినేత్రి మాయావతి తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నట్లు సోమవారమే ప్రకటించారు. అలాగే ఈసారి లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో 42 ఎంపీ సీట్లలో అత్యధిక స్థానాలు గెలుచుకొంటామని ధీమాగా ఉన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. కనుక ఆ మూడు పార్టీలు ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వాములుగా జేరుతాయా లేదా? ఒకవేళ జేరితే కేంద్రప్రభుత్వంలో చక్రం తిప్పాలనుకొంటున్న సిఎం కేసీఆర్‌ వారికి మద్దతు ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ నెలాఖరులోగా లభించవచ్చు.


Related Post