అవకాశం వస్తే ప్రధాని పదవికి నేనూ రెడీ:మాయావతి

May 07, 2019


img

దేశంలో ఉన్నది ఒక్క ప్రధాని పదవే అయినా కనీసం డజను మంది ఆ కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీఎస్పీ అధినేత్రి మాయావతి వారిలో ఒకరు. అయితే ఇంతకాలం తన మనసులో మాట బయటకు చెప్పకపోయినా సోమవారం లక్నోలోని అంబేడ్కర్‌ నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, “ఈసారి దేశరాజకీయలలో అంబేడ్కర్‌ నగర్‌ కీలకపాత్ర పోషించబోతోంది. మే 24న నరేంద్రమోడీ గద్దె దిగడంత ‘నమో శకం’ ముగియబోతోంది. ఆ తరువాత ‘జై భీమ్’ శకం ప్రారంభం కాబోతోంది. అన్నీ అనుకొన్నట్లు జరిగితే ఈసారి ఇక్కడి నుంచే నేను పోటీ చేసి దేశరాజకీయాలను శాశిస్తాను,” అని మాయావతి అన్నారు. 

సాధారణంగా ప్రతీ ఎన్నికలలో తమ పార్టీ తప్పకుండా గెలుస్తుందని అందరూ చెప్పుకొంటుంటారు కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తప్పకుండా ఓడిపోబోతోందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతుండటం చాలా ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ సొంతంగా అధికారంలోకి రాలేవని అంచనా వేస్తున్న ప్రతిపక్షాలు ఈసారి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం తమకే లభిస్తుందని ఆశపడుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు అవకాశమున్న చోట్ల ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. యూపీలో దశాబ్ధాలుగా బద్ద శత్రువులుగా ఉన్న ఎస్పీ-బీఎస్పీల పొత్తులే ఇందుకు చక్కటి నిదర్శనం. కనుక అన్ని ప్రాంతీయ పార్టీల నేతలు ప్రధాని పదవిపై కన్నేసి ఉన్నారు. 

కానీ ఒకవేళ బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఏర్పడితే, ఎస్పీ, బీఎస్పీలతో సహా చాలా పార్టీలు లౌకికముద్ర ఉన్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అధికారం చేజిక్కించుకొనే ప్రయత్నించవచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీయే ప్రధాని పదవిని ప్రాంతీయ పార్టీలకు త్యాగం చేసి కేంద్రంలో అధికారం దక్కించుకొనేందుకు ప్రయత్నించవచ్చు. కానీ కాంగ్రెస్‌ మద్దతు లేకుండా దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చు.


Related Post