దిగిపోయేవాడితో మాటలేంటి? మమతా బెనర్జీ

May 06, 2019


img

ఒడిశాలో విధ్వంసం సృష్టించిన ఫణి తుఫాను రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుండటం విశేషం. ఒడిశా నుంచి పశ్చిమబెంగాల్ వైపు ఫణి తుఫాను ప్రయాణించడంతో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ ప్రధాని మోడీ స్వయంగా రెండుసార్లు చేసినా ఆమె అందుబాటులో లేరనే సమాధానం వినిపించడంతో ‘మమతా బెనర్జీకి ఇంత అహంకారం పనికిరాదన్నట్లు’ మోడీ ట్వీట్ చేశారు. 

మోడీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడానికి ఇష్టపడని మమతా బెనర్జీ ఆయన చేసిన ఈ ట్వీట్ పై వెంటనే స్పందించారు. బిష్ణుపూర్‌లో ఈరోజు జరిగిన ఎన్నికలసభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ “నేడోరేపో పదవిలో నుంచి దిగిపోయేవ్యక్తితో మాట్లాడి ప్రయోజనం ఏమిటి? నాకు ఆ అవసరం లేదు. ఆయన ఒక కాలం చెల్లిన ప్రధాని. అటువంటి వ్యక్తితో ఒకే వేదికపై కూర్చోవడం ఇష్టం లేకనే నేను ఆయనకు తిరిగి ఫోన్ చేయలేదు,“ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. 

ప్రధాని నరేంద్రమోడీ ఒడిశా వెళ్ళి సిఎం నవీన్ పట్నాయక్ తో కలిసి తుఫానుప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేయడం, విమానం దిగిన వెంటనే ఒడిశాకు తక్షణసాయంగా రూ.1,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంపై కూడా కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

బిజెపికి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని ఎంపీ సీట్లు వచ్చే అవకాశం లేదని గ్రహించినందునే ప్రధాని నరేంద్రమోడీ ఈవంకతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను మంచి చేసుకొని లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత ఆయన మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిని తుఫాను రాజకీయమనుకోవాలేమో? 


Related Post