తెలంగాణలో వైకాపా వ్యూహం ఏమిటో?

July 24, 2016


img

తెలంగాణలో వైసిపి వ్యవహార శైలి ఎప్పుడూ మిగిలిన రాజకీయ పార్టీలకి పూర్తి భిన్నంగా, చాలా విచిత్రంగా ఉంటుంది. అది తెరాసకి మిత్రపక్షమా...ప్రతిపక్షమా అనేది అంతు పట్టదు. ప్రజా సమస్యలపై ఎన్నడూ పోరాడదు కానీ ఎప్పటికప్పుడు పార్టీలో కమిటీలు అవీ ఏర్పాటు చేసుకొంటూ ఎన్నికలకి సర్వసిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది. వచ్చే ఎన్నికలలో మనమే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకొంటుంటారు కానీ ఏనాడు కనీసం తమ ఉనికిని చాటుకొనే కార్యక్రమాలు కూడా చేపట్టరు. ఏపి వైసిపితో పోల్చి చూస్తే ఆ తేడా ఇంకా స్పష్టంగా కనబడుతుంది. అంతే కాదు ఆ పార్టీలో నేతలు తమ రాజకీయ మనుగడ, భవిష్యత్ గురించి చింతిస్తున్నట్లు కనబడకపోవడం విశేషం. అప్పుడప్పుడు లోటస్ పాండ్ లో సమావేశం అవుతుంటారు. రాజశేఖర్ రెడ్డిని ఓ సారి తలుచుకొంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకొన్నామని చెపుతుంటారు. ఇంత విచిత్రమైన రాజకీయ పార్టీని దేశంలో ఎక్కడా చూసి ఉండము.

మొన్న బుధవారం ఆ పార్టీ నేతలు మళ్ళీ లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారని వారికి అండగా నిలబడదామని తెలంగాణ వైసిపి అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పధకాలనే కెసిఆర్ కూడా కొనసాగిస్తున్నారని, కానీ కొత్తగా ఒక్క పధకం కూడా ప్రవేశపెట్టలేకపోయారని విమర్శించారు. సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకి పిలుపునిచ్చారు. ఈ సమావేశం విజయవంతం అయ్యిందని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడంతో సమావేశం ముగిసింది.

వైసిపి తీరు చూస్తే అసలు దానిని జగన్ ఇంకా సజీవంగా ఎందుకు ఉంచుతున్నారు? దానికి ఏదైనా బలమైన కారణం ఉందా? అనే అనుమానం కలుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి చాలా చోట్ల ఆస్తులున్నాయి. తెలంగాణలో వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నట్లు సమాచారం. వాటి జోలికి తెరాస, ప్రభుత్వం రాకుండా ఉంచేందుకే పార్టీని సజీవం ఉంచుతున్నారా? లేక తెరాస, వైసిపిలకి ఉమ్మడి శత్రువైన టిడిపిని నిలువరించేందుకే పార్టీని కొనసాగిస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కారణాలు ఏవైనా తెలంగాణలో రాజకీయంగా ఎదగాలని ఏనాడూ కోరుకొని అటువంటి పార్టీని నమ్ముకొన్న నేతలు, కార్యకర్తల రాజకీయ భవిష్యత్ మాత్రం ఎప్పటికీ ప్రశ్నార్ధకంగానే మిగిలిపోవచ్చు.


Related Post