తెలంగాణలో భాజపా పరిస్థితేంటి?

July 16, 2016


img

తెలంగాణలో భాజపా బలంగా ఉందా లేదా అనే ప్రశ్నకి ఆ పార్టీ నేతలు కూడా ఉందని గట్టిగా చెప్పలేరు. గత రెండేళ్ళుగా రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలలో కూడా ఆ పార్టీ విజయం సాధించలేదు. విజయం సాధించడమే దాని బలానికి గీటురాయిగా చెప్పుకోవడం సరికాకపోవచ్చు కానీ ఆ అపజయాలు దాని బలహీనతకి అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు.  తెలంగాణలో భాజపాకి బాగా బలం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఓటమితోనే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో కళ్ళకి కట్టినట్లు కనబడింది. కొంచెం ఆలస్యంగా నైనా భాజపా తన బలహీనతని గుర్తించి, అంగీకరించి, సరిదిద్దుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టడం అభినందనీయమే. డా.లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి పార్టీని పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఎన్నికలకి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కనుక ఆయన ప్రయత్నాలు ఫలిస్తే ఆ లోగా రాష్ట్రంలో భాజపా మళ్ళీ పుంజుకోవచ్చు.

ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తూనే, మరో వైపు తెరాస ప్రభుత్వంపై భాజపా పోరాటం మొదలుపెట్టింది. కానీ అక్కడ మళ్ళీ తప్పు దారి పట్టినట్లు కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులలో అవినీతిని హైలైట్ చేస్తూ పోరాడి ప్రజలని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటే, మంచి మైలేజ్ దొరికే ఆ సమస్యపై శ్రద్ధ పెట్టకుండా, తనకి అలవాటైన మతం అంశం పట్టుకొని మైలేజ్ కోసం తిప్పలు పడుతోంది. పాతబస్తీలో పట్టుబడ్డ ఉగ్రవాదులకి మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ న్యాయసహాయం చేస్తానని ప్రకటించినందుకు, ఆయనని అరెస్ట్ చేయాలని, మజ్లీస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టుకొంది. మజ్లీస్ మాటలని కెసిఆర్ ఖండించకపోవడం తప్పే. కానీ దానితో ఆయనని నిలువరించలేదు. “షెల్ఫ్ లైఫ్” తక్కువగా ఉండే అటువంటి అంశాలని పట్టుకొని వేలాడుతూ భాజపా తన విలువైన సమయం వృధా చేసుకొంటోందని చెప్పవచ్చు. 

రాష్ట్రంలో తెదేపా బలహీనపడిన కారణంగా తెరాసకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతోంది. కనుక రాష్ట్ర భాజపా నేతలు దానిని ఢీకొని తమ సత్తా చాటుకొని ఉంటే ప్రజలు భాజపా గురించి కూడా ఆలోచించేవారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలని పట్టించుకోకుండా ఎంతసేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల గురించి ఎక్కువగా మాట్లాడటం వలన రాష్ట్ర భాజపాకి ఎటువంటి ప్రయోజనం, గుర్తింపు పొందలేకపోతోంది. సోనియా, రాహుల్ గాంధీల సంగతి కేంద్రంలో ఉన్న భాజపా మంత్రులు, నేతలు చూసుకొంటారు. కనుక రాష్ట్ర భాజపా నేతలు రాష్ట్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నేతలను గట్టిగా ఎదుర్కోవడం మంచిది. అప్పుడే ప్రజలు కూడా భాజపా ఉనికిని గుర్తించడం మొదలుపెడతారు.

ఇక వరంగల్ లోక్ సభకి జరిగిన ఉప ఎన్నికల నుంచి భాజపా ఇంకా గుణపాఠం నేర్చుకొన్నట్లు లేదు. ఆ ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధే లేకపోవడంతో అమెరికా నుంచి అర్జెంట్ గా డా.దేవయ్యని దిగుమతి చేసుకోవలసి వచ్చింది. అయినా ఓటమి తప్పలేదు. అంటే అత్యవసరంగా పార్టీలో అభ్యర్ధులని తయారు చేసుకోవలసిన అవసరం ఉందన్న మాట! కనుక పార్టీని బలోపేతం చేసుకొంటూనే నాయకత్వ లక్షణాలున్న అభ్యర్ధులని, ముఖ్యంగా కాంగ్రెస్, తెరాస నేతలని ఢీ కొనగల వారిని వెతికి పట్టుకొని వచ్చే ఎన్నికల నాటికి వారిని సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే రాష్ట్రంలో భాజపా బలపడుతుంది.


Related Post