ఏ పార్టీలో ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది: జగ్గారెడ్డి

April 22, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో తెరాసలొ చేరబోతున్నారనే మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన వాటిని ఖండించకపోగా, ‘నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉండాలో కాలమే నిర్ణయిస్తుందని” చెప్పి ఆ వార్తలకు బలం చేకూర్చారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ, “ఎవరూ వారంతట వారుగా తెరాసలోకి వెళ్ళడం లేదు. తెరాస ఒత్తిడి కారణంగానే వెళుతున్నారు. వెళ్ళేవారిని నిలుపుకోవడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ అవతల తెరాస ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్ళిపోతున్నారు. నా విషయం కాలమే నిర్ణయిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఎంతమంది వీడినా అది నశించిపోదు. ఎందుకంటే అదొక మర్రిచెట్టు వంటిది. ఒక ఊడ కత్తిరిస్తే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీకి శ్రేణులే శ్రీరామరక్ష. అలాగే రైతులు సమస్యలతో సతమతమవుతున్నంత కాలం మా రాజకీయనాయకులకు డోకా లేదు. వారి సమస్యలు తీరేవి కావు కనుక రాజకీయ నాయకులు హాయిగా జీవించేస్తారు.  

కాంగ్రెస్ పార్టీని వీడటం వ్యక్తిగత విషయమే కానీ పార్టీ వీడిన తరువాత పార్టీపై విమర్శలు, ఆరోపణలు చేయడం తగదు. రాష్ట్రంలో చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఈస్థాయికి వచ్చారనే విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారు. సంగారెడ్డి నీటి ఎద్దడికి కారకుడు మాజీ మంత్రి హరీష్‌రావే! ఆయన సింగూర్ జలాలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తరలించుకుపోయి ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు,” అన్నారు జగ్గారెడ్డి. 

తెరాసలొ సీనియర్ నేత అయిన హరీష్‌రావును ఈవిధంగా విమర్శిస్తూ జగ్గారెడ్డి ఆ పార్టీలోనే చేరాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తెరాసలో చేరిన తరువాత కూడా హరీష్‌రావును తప్పు పడతారా లేక మౌనం వహించి సంగారెడ్డి ప్రజల నీటి కష్టాలను పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని కూర్చోంటారా? కాలమే చెపుతుంది. 


Related Post