త్వరలో తెరాసలో కాంగ్రెస్‌ విలీనం?

April 22, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో తెరాసతో హోరాహోరీగా పోరాడి గెలిచిన 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే తెరాసలో చేరిపోయారు. త్వరలో మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా తెరాసలో చేరిపోయేందుకు సిద్దం అవుతున్నారు. వారు కూడా చేరిపోయిన తరువాత కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెరాసలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ విలీనప్రక్రియపై ఎటువంటి సమస్యలు రాకుండా న్యాయనిపుణుల సలహాలు తీసుకొంటున్నామని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే మిగులుతారని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగయ్యే అవకాశం ఉందని తెరాసలో చేరిన మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 25వ తేదీన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరే అవకాశం ఉందని తాజా సమాచారం.

తెరాసలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కోరుతూ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఒకవేళ ఆయన స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా హెచ్చరించారు. కనుక అంతకంటే ముందుగానే ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన వెంటనే 13 మంది కలిసి తమను తెరాసలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ ఇవ్వడం, వెంటనే దానిపై ఆయన ఆమోదముద్ర వేయడం జరిగిపోవచ్చు. 

అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ అవుతుంది. అంతేకాదు...శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షహోదా కూడా కోల్పోతుంది. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో, జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టమే.


Related Post