తెరాసలో చేరేందుకు తొందరపడోద్దు: జీవన్‌రెడ్డి

April 22, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జగిత్యాలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెరాసకు వ్యతిరేకంగా వస్తే పరిషత్ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందనే భయంతోనే తెరాస సర్కారు ఇంత హడావుడిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనుకొంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో తెరాస గెలిచినప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యధికస్థానాలు గెలుచుకోవడం ఖాయం. కనుక తెరాసలో చేరిపోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు ఆగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పరిషత్ ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లు తగ్గించేసి తెరాస సర్కారు వారికి అన్యాయం చేసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని హైకోర్టు చెపితే, 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఉండకూడదనే సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి బీసీల రిజర్వేషన్లలో కొత్త విదించింది. గ్రామ సర్పంచ్ లకు ప్రభుత్వం ఇంతవరకు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో పంచాయితీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నారు,” అని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో తెరాస 16 సీట్లు గెలుచుకోబోతోందని సిఎం కేసీఆర్‌, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తదితరులు ఎంతో నమ్మకంగా చెపుతుంటే, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలు ఎవరూ కూడా అంతా ధీమా వ్యక్తం చేయలేకపోయారు. కానీ జీవన్‌రెడ్డి మాత్రం తెరాస కంటే కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోందన్నట్లు చెప్పడం విశేషం. లోక్‌సభ ఎన్నికలు రాష్ట్ర కాంగ్రెస్‌ 7-8 ఎంపీ సీట్లు గెలుచుకొనే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఈసారి బిజెపి కూడా 2-3 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుచుకోగలదని నమ్మకంగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌, బిజెపిలు కలిపి 7-8 ఎంపీ సీట్లు గెలుచుకొన్నా సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆశలు అడియాసలవుతాయి. తెరాస, కాంగ్రెస్‌, బిజెపిలలో ఏది ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకొంటుందో తెలియాలంటే మరో నెలరోజులు వేచి చూడక తప్పదు.  


Related Post