ప్రాంతీయ పార్టీలదే హవా: రాహుల్ గాంధీ

April 20, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి కేంద్రంలో అధికారం, ప్రధానమంత్రి పదవిని చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలే పైచేయి సాధించబోతున్నాయని జోస్యం చెప్పడం విశేషం.

రాహుల్ గాంధీ న్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తూ “దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో బిజెపికి ఎదురుగాలి వీస్తోంది. అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బిజెపితో గట్టిగా పోరాడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్ కూటమి, ఏపీలో టిడిపి, తమిళనాడులో కాంగ్రెస్‌-డిఎంకె కూటమి అధికారంలోకి రానున్నాయి. బిజెపి అధికారంలో ఉన్న యూపీ, గుజరాత్, మహారాష్ట్రలలో కూడా బిజెపి ఎదురీదుతోంది. కనుక ఈసారి కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమే అధికారంలోకి రాబోతోంది,” అని చెప్పారు. 

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పేరుకి జాతీయ పార్టీలే అయినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలలో అవి ఒంటరిగా పోటీ చేసి గెలిచే స్థితిలో లేవనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ఆ రెండు పార్టీలకు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదిరాయి. కనుక ఆ రాష్ట్రాలలో అవి పొత్తులు పెట్టుకొన్న పార్టీలు గెలిస్తే కాంగ్రెస్‌ లేదా బిజెపిల బలం పెరుగుతుంది. కానీ ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్‌, బిజెపిలు ముఖాముఖీ తలపడుతున్నాయి. కనుక ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపిలలో ఏది ఎక్కువ ఎంపీ సీట్లు సాధించుకోగలిగితే అదే ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 

ఈసారి బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తుండటం దానికి కలిసి వస్తోందని చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు మించి గెలుచుకోలేదని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. కనుక ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్‌, బిజెపిలలో ఏది ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకొంటుంది? ప్రాంతీయ పార్టీలలో ఏవి ఎవరికి మద్దతు ఇస్తాయి? నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ లేదా ఎవరు ప్రధాని అవుతారు? అనే ప్రశ్నలకు మే 23న ఫలితాలు వెలువడిన తరువాతే సమాధానం లభిస్తుంది.


Related Post