పేదలకు న్యాయ్ సాధ్యమేనా జీ?

April 20, 2019


img

శుక్రవారం కర్ణాటకలో రాయచూరు, చిక్కోడిల్లో జరిగిన బహిరంగ సభలలో రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో బిజెపికి ఎదురుగాలి వీస్తోంది. అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బిజెపితో గట్టిగా పోరాడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్ కూటమి, ఏపీలో టిడిపి, తమిళనాడులో కాంగ్రెస్‌-డిఎంకె కూటమి అధికారంలోకి రానున్నాయి. చివరికి గుజరాత్ లో కూడా బిజెపి ఎదురీదుతోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోడీ గత 5 ఏళ్ళలో దేశానికి ఏమీ చేయలేకపోయినా కనీసం తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు కూడా ఏమీ చేయలేదు. పైగా నోట్లరద్దు, జిఎస్టిలతో సామాన్య ప్రజలను రోడ్డుపైకి తెచ్చారు. చిన్న చిన్న వ్యాపారస్తులను దివాళా తీయించి అనిల్ అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు మేలు కలిగించారు. నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికే నోట్లరద్దు అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ, బడా వ్యాపారస్తులు మరింత సులువుగా నల్లధనం పోగేసుకొనేందుకు వీలుగా రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టి దేశంలో నల్లధనం పెరిగేందుకు తోడ్పడ్డారు. రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో దేశప్రజలకు చెందిన రూ.30,000 కోట్లు ప్రధాని నరేంద్రమోడీ అనీల్ అంబానీకి అప్పనంగా ఇచ్చేశారు. మోడీ నిర్ణయాల వలన దేశప్రజలకు కలిగిన ఈ నష్టాలను పూడ్చేందుకే మేము అధికారంలోకి రాగానే న్యాయ్ పధకం ద్వారా ప్రతీ పేదకుటుంబం బ్యాంక్ ఖాతాలోకి ఏడాదికి రూ.72,000 జమా చేస్తాము. తద్వారా మళ్ళీ పేదల ఆర్ధిక పరిస్థితి దానితోపాటు దేశ ఆర్దిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది,” అని చెప్పారు. 

పేదవారి బ్యాంక్ ఖాతాలలో ఏడాదికి రూ.72,000 చొప్పున జమా చేయాలంటే, ఆ భారాన్ని మళ్ళీ దేశప్రజలపైనే మోపవలసి ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీయో లేదా రాహుల్ గాంధీ జేబులో నుంచి తీసి ఈయరనే సంగతి అందరికీ తెలుసు. ఏడాదికి రూ.72,000 ఇస్తామని రాహుల్ గాంధీ చెపుతున్నప్పుడు దేశంలో పేద, మద్యతరగతి ప్రజలు కూడా ఆ సొమ్ము తమకు కూడా వస్తుందనే ఆశపడి ఓట్లేస్తారనేది నిజం. దేశంలో దాదాపు 30-35 కోట్ల మందికి పైగా నిరుపేదలున్నారని అధికార గణాంకాలే చెపుతున్నప్పుడు, కేవలం 5 కోట్ల మందికి న్యాయ్ పధకం ద్వారా సహాయం చేస్తానని రాహుల్ గాంధీ చెపుతున్నారు. ఆ 5 కోట్లలో మనం కూడా ఉన్నామా లేదా అని ప్రజలే ఆలోచించుకోవాలి. కాదనిపిస్తే ఇది ఓటర్లను ఆకట్టుకోవడానినే కాంగ్రెస్‌ చేస్తున్న జిమ్మిక్ అని అర్ధం అవుతోంది.

రాహుల్ గాంధీ కనిపెట్టిన ఈ న్యాయ్ పధకం అమలుచేయాలంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టవలసి ఉంటుంది. అప్పుడే అది సాధ్యం అవుతుంది తప్ప సంకీర్ణ ప్రభుత్వంలోనో...మమతా బెనర్జీ లేదా మాయావతి ప్రధానమంత్రిగా ఉంటే అమలుచేయడానికి వారు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏదోవిధంగా 5 కోట్ల మంది ఖాతాలలో ఏడాదికి రూ.72,000 జమా చేసినా దానితోనే దేశ ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడుతుందనుకోవడం వట్టి భ్రమ.


Related Post