ధైర్యం లేకనే రజినీ టైమ్ తీసుకొంటున్నారా?

April 19, 2019


img

దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దేవుడు ఆదేశిస్తే రాజకీయాలలోకి వస్తానని’ గత 10-15 ఏళ్లుగా చెపుతున్నారు. కానీ ఎన్నికలొచ్చిన ప్రతీసారి ఏదో హడావుడి చేయడమే తప్ప ధైర్యం చేయలేకపోతున్నారు. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఆయనకు నిజంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించాలనే ఉద్దేశ్యం, ధైర్యం ఉన్నట్లయితే ఇంతకంటే మంచి అవకాశం రాదు. కానీ ఈసారి కూడా ఎప్పటిలాగే అభిమానులతో  ఫోటో సెషన్ పేరిట హడావుడి చేసి ఎన్నికలొచ్చేసరికి చేతులు ఎత్తేశారు. 

ఆయన సహనటుడు కమల్ హాసన్ రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పడమే కాకుండా వెంటనే వచ్చేసి పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం నేటికీ రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 

ఇవాళ్ళ మీడియా ప్రతినిధులు ఆయనను కలిసినప్పుడు ఇదే విషయమై ప్రశ్నించగా, “ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మా పార్టీ తప్పక పోటీ చేస్తుందని” చెప్పారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తన రాజకీయ ప్రవేశంపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. అంటే రజినీకాంత్ మరికొంత సమయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ అప్పటి పరిస్థితులను బట్టి తన రాజకీయ ప్రవేశాన్ని మళ్ళీ మరో ఏడాది వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు. 

సినిమాలలో చాలా సాహసవంతుడుగా కనిపించే రజనీకాంత్ నిజజీవితంలో ఏమాత్రం రిస్క్ తీసుకోలేకపోతున్నట్లు కనబడుతోంది. ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే ఏమవుతుందో అని ఆయన భయపడుతున్నట్లయితే తన సహ నటుడు కమల్ హాసన్ స్థాపించిన పార్టీకో లేదా కాంగ్రెస్, బిజెపి, డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలలో ఏదో ఒక పార్టీకి మద్దతు ప్రకటిస్తే సరిపోయేది. ఆ రిస్క్ కూడా వద్దనుకొంటే...రాజకీయాలలో చేరే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా ప్రకటించి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకోకుండా రాజకీయాలలోకి వస్తానని చెపుతూ రాజకీయాలపై తన ముద్ర, ప్రభావం చూపాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.


Related Post