కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి చురకలు

April 19, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సిఎం కేసీఆర్‌కు చురకలు వేశారు. రెవెన్యూశాఖను రద్దు చేయాలనే ప్రతిపాదనపై స్పందిస్తూ, “ఒకప్పుడు ఇదే రెవెన్యూ ఉద్యోగులు భూప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన గొప్పగా చేశారని సిఎం కేసీఆర్‌ స్వయంగా మెచ్చుకొని వారికి ఒక నెల జీతం బోనస్ గా ఇచ్చారు కూడా. అప్పుడు పొగిడిన నోటితోనే ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులు అవినీతిపరులని, లంచగొండులని నిందిస్తున్నారు. అయినా తెరాస ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతునప్పుడు దానికి ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత వహించరా? 

భూప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పనుల గురించి తెరాస నేతలు గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు ఆ పనులు సక్రమంగా జరుగలేదని, చాలా మంది రైతులకు పాసుపుస్తకాలు అందలేదని, అందినా వాటిలో అనేక తప్పులున్నాయని మేము ఆనాడే చెప్పాము కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఇప్పటికైనా మీ ప్రభుత్వంలో అవినీతి ఉందని గుర్తించి ఒప్పుకొన్నందుకు చాలా సంతోషం. అయితే పరిషత్ ఎన్నికలలో రైతులు మిమ్మల్ని నిలదీస్తారనే భయంతోనే మీ తప్పులను రెవెన్యూశాఖపైకి తోసేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. 

రెవెన్యూశాఖను రద్దు కంటే ముందుగా మీ ఆలోచనా విధానం, పాలనా విధానంలో మార్పు రావాలి. మీరు తొందరపాటు నిర్ణయాల కారణంగా ఏవైనా సమస్యలు ఉత్పన్నం అయితే వాటికి మీరే బాధ్యత వహించాలి కానీ ఉద్యోగులు కాదు కదా? 

ఉదాహరణకు హౌసింగ్ విభాగాన్ని రద్దు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించాలనుకోవడం హాస్యాస్పదంగా అనిపించడం లేదా? ప్రజల నుంచి లంచాలు తీసుకోవాలని స్వయంగా కేటీఆర్‌ చెప్పారని సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ చెప్పారు. మరి ఆయనపై ఏమి చర్యలు తీసుకొన్నారో చెప్పగలరా? పాలనా విధానంలోనే లోపం ఉన్నప్పుడు దానిని సవరించుకోకుండా ఉద్యోగులను నిందించి ఏమి ప్రయోజనం? అధికార యంత్రాంగం మారాలంటే ముందుగా రాజకీయ వ్యవస్థ ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది,” అని అన్నారు. 


Related Post