వ్యూహాలు మార్చుకొన్న తెరాస, కాంగ్రెస్‌

April 19, 2019


img

త్వరలో జరుగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అధికార తెరాస, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలు అమలుచేయబోతున్నాయి. ఈ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో మళ్ళీ పట్టుసాధించాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా కాంగ్రెస్‌కే అప్పగించాలని నిర్ణయించింది. అయితే ఎన్నిక తరువాత గెలిచిన అభ్యర్ధులు తెరాసలో ఫిరాయిస్తారనే భావన ప్రజలలో బలంగా ఉన్నందున, ఈ ఎన్నికలలో కూడా తెరాసవైపే మొగ్గుచూపవచ్చును కనుక ప్రజలకు నమ్మకం కలిగించడానికిగాను అభ్యర్దుల నుంచి ‘ఎన్నికలలో గెలిచైనా తరువాత పార్టీ మారబోమని, ఒకవేళ మారితే తమపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని’ లిఖితపూర్వకంగా అఫిడవిట్ వ్రాయించి తీసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. 

అందుకు పూర్తి విరుద్దంగా ఈసారి అభ్యర్ధుల పేర్లను హైదరాబాద్‌లోనే ఖరారు చేయాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి అభ్యర్ధుల జాబితాను రూపొందించి తనకు సమర్పించాలని కేసీఆర్‌ ఆదేశించారు. కానీ ఎవరూ ఎవరికీ ఎటువంటి హామీలు ఇవ్వవద్దని స్పష్టంగా చెప్పారు. పార్టీలో టికెట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నందున అవసరమైతే హైదరాబాద్‌లోనే అభ్యర్ధుల జాబితాను రూపొందించి జిల్లాలకు పంపించి దానిపై జిల్లా ఎమ్మెల్యేల  అభిప్రాయాలు కోరాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. 

ఇప్పటివరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రతీ చిన్న విషయానికి డిల్లీ పరుగులు తీసి అధిష్టానం అనుమతి కోరుతుండేవారు. అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఇదే విషయం పదేపదే ప్రస్తావించి ఎద్దేవా చేసింది. కానీ పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలకు అభ్యర్ధుల ఎంపిక బాద్యత కట్టబెట్టగా, సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ పద్దతిలో అన్నీ హైదరాబాద్‌లోనే నిర్ణయించాలనుకొంటుండటం విశేషం.


Related Post