కేసీఆర్‌కు దేవెగౌడ హ్యాండ్ ఇచ్చేసినట్లే!

April 19, 2019


img

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం సిఎం కేసీఆర్‌ కలిసిన రెండవ వ్యక్తి హెడి దేవెగౌడ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జెడిఎస్ పార్టీకి సిఎం కేసీఆర్‌ అడగకుండానే మద్దతు ఇచ్చారు. కానీ దేవెగౌడ, కుమారస్వామి మాత్రం తెరాసకు బద్దవిరోది అయిన కాంగ్రెస్‌తో చేతులు కలిపి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే తండ్రీకొడుకులు రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న కారణంగానే దేవెగౌడ, చంద్రబాబునాయుడు దగ్గరయ్యారు. ఏపీ, అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికలలో దేవెగౌడ ఏపీకి వచ్చి టిడిపి తరపున ఎన్నికల ప్రచారం చేయగా, ఆ తరువాత చంద్రబాబునాయుడు కర్ణాటక వెళ్ళి కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అంటే కేసీఆర్‌ చేతిలో నుంచి దేవెగౌడ జారిపోయినట్లే చెప్పవచ్చు. జారిపోవడమేకాదు... కేంద్రంలో చక్రం తిప్పలనే కేసీఆర్‌ ప్రయత్నాలకు అడ్డుపడబోతున్నారు. 

ఇవాళ్ళ ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఆయన ప్రధానమంత్రి చేయవలసిన బాధ్యత నాపై ఉంది. అందుకు నేను గట్టిగా కృషి చేస్తాను. నేను బిజెపి వ్యవస్థాపకుడు లాల్ కృష్ణ అద్వానీలా ప్రత్యక్షరాజకీయాల నుంచి తప్పుకోదలచుకోలేదు. నా శరీరంలో శక్తి ఉన్నంతవరకు రాజకీయాలలోనే కొనసాగుతాను. ప్రజాసేవ చేస్తుంటాను. ప్రజాభీష్టం మేరకే నేను ఈసారి తుముకూరు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నాను,” అని చెప్పారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలిసి పనిచేసేందుకు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు సిద్దంగా ఉన్నాయని సిఎం కేసీఆర్‌ చెప్పుకొంటున్నారు. కానీ ఒక్క వైసీపీ తప్ప మరే పార్టీ తెరాసతో కలిసి పనిచేస్తామని బహిరంగంగా ప్రకటించలేదు. కేసీఆర్‌ కలిసిన దేవెగౌడ (కర్ణాటకలోని జెడిఎస్), స్టాలిన్ (తమిళనాడులోని డిఎంకె) రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని రాహుల్ గాంధీ అభ్యర్ధిత్వానికి బహిరంగంగా మద్దతు ఇవ్వగా, మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్), నవీన్ పట్నాయక్ (ఒడిశాలోని బిజెడి) ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలిసిపనిచేస్తారో లేదో ఇంతవరకు చెప్పలేదు. యూపీలోని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పట్ల ఆసక్తి చూపినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల కోసం యూపీలోని తన రాజకీయశత్రువైన బీఎస్పీతో పొత్తులు పెట్టుకొన్నందున ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరుకొంటున్నట్లు ప్రకటించారు. కనుక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడి అన్ని పార్టీల బలాబలాలు తేలితేగానీ సిఎం కేసీఆర్‌ వెంట ఎన్ని పార్టీలు ఉంటాయో తెలియదు. 


Related Post