తెలంగాణలో బిజెపికి ఒక్క సీటు కూడా రాదు: మమత

April 19, 2019


img

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరియు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజా ఇంటర్వ్యూలో బిజెపి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

ఒక ప్రశ్నకు సమాధానంగా “ఈసారి దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో బిజెపికి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. పశ్చిమబెంగాల్, డిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో కూడా బిజెపికి పరాభవం తప్పదు. గతంలో బిజెపి పాలించిన మద్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాలలో కలిపి 40-50కు మించి సీట్లు రావు. అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి కనుక కాంగ్రెస్, బిజెపిలలో ఏదీ కూడా సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగినన్ని ఎంపీ సీట్లు గెలుచుకోలేవు. ఈసారి కేంద్రప్రభుత్వం ఏర్పాటులో యూపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలే కీలకపాత్ర పోషించబోతున్నాయి. కేంద్రంలో ఒక సరికొత్త కూటమి అధికారంలోకి రాబోతోంది. ప్రాంతీయపార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. దాని రూపురేఖలు ఏవిధంగా ఉంటాయో చూద్దాం,” అన్నారు మమతా బెనర్జీ. 

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఆమె చెప్పిన మాటలు కేసీఆర్‌ మనసులో మాటల్లాగే ఉన్నాయి. కానీ దాని ఏర్పాటులో తెరాస కీలకపాత్ర పోషిస్తుందని సిఎం కేసీఆర్‌ చెపుతుంటే, పశ్చిమబెంగాల్, యూపీ కీలకపాత్ర పోషించబోతున్నాయని మమతా బెనర్జీ చెపుతుండటం ఆలోచింపజేస్తోంది. ఆ రెండు రాష్ట్రాలలోనే అత్యధిక ఎంపీ సీట్లు ఉన్నందున అవి కేంద్రప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించడం సహజమే. ప్రధానమంత్రి రేసులో మమతా బెనర్జీ, మాయావతి ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక తమ ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రధాని కాబోతున్నామని ఆమె చెపుతున్నట్లుగా భావించవచ్చు. 

కానీ ఇక్కడ తెరాస నేతలు ‘దేశ ప్రజలు  కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని’ చెపుతూ కేసీఆర్‌ కూడా ప్రధానిరేసులో ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. కానీ అదే సమయంలో 16 ఎంపీ సీట్లతో కేంద్రం మెడలు వంచి అన్ని సాధించుకోస్తామని చెపుతున్నారు. ఒకవేళ కేసీఆర్‌ ప్రధాని అయితే తెరాస ఎవరి మెడలు వంచనవసరం లేదు కదా? అంటే మమతా బెనర్జీ, మాయావతీలలో ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చి కేంద్రప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు తోడ్పడి తెలంగాణకు అవసరమైనవన్నీ సాధించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు మనం భావించవచ్చు. 

ఇంతవరకు బాగానే ఉంది. కానీ కాంగ్రెస్‌, బిజెపిల మద్దతు లేకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ సొంతంగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయగలదా లేదా? ఒకవేళ చేయలేకపోతే కాంగ్రెస్‌ మద్దతు స్వీకరిస్తుందా? అందుకు కేసీఆర్‌ అంగీకరిస్తారా? అంగీకరించకపోతే బిజెపికి మద్దతుకూడగట్టి మళ్ళీ నరేంద్రమోడీ ప్రధాని అయ్యేందుకు సహకరిస్తారా? అనే ప్రశ్నలకు మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే సమాధానం లభిస్తుంది. 


Related Post