మిర్చి వచ్చింది...ధరలు తగ్గాయి!

April 18, 2019


img

ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు భారీగా మిర్చి బస్తాలు వచ్చాయి. గురువారం నాటికి మార్కెట్ యార్డులో 50,000కు పైగా మిర్చీ బస్తాలు తరలి వచ్చాయి. షరా మామూలుగానే ఒకేసారి అంతా మిర్చి మార్కెట్ యార్డుకు తరలిరావడంతో 24 గంటల వ్యవదిలో మిర్చి క్వింటాలుకు రూ.300-500 వరకు ధర పడిపోయింది. దానికితోడు శుక్రవారం నుంచి మూడు రోజులు మార్కెట్ బంద్‌కు ఉంటుందని తెలుస్తోంది. అయినా మార్కెట్లకు బారీగా మిర్చి తరలివస్తున్నప్పుడు వెంట వెంటనే కతా వేయించి కొనుగోళ్ళు చేయవలసిందిపోయి మూడు రోజులు బంద్‌ చేయడమేమిటో అర్ధం కాదు. 

ఇక రైతులంటే వరుణదేవుడికి కూడా అలుసే. వారు పంటలు వేసి వర్షపు చినుకుల కోసం ఆశగా ఆకాశం వైపు ఎదుర్చూపులు చూస్తున్నప్పుడు మొహం చాటేసే వరుణదేవుడు, ఇప్పుడు పిలవని పేరంటానికి వచ్చినట్లు వచ్చి వర్షం కురిపించి మిర్చిని తడిపి ముద్ద చేసి మిర్చి రైతు కంట కన్నీళ్ళు పెట్టించకమానడు. మార్కెట్ యార్డులో, యార్డుకు వెళ్ళే దారి పొడవునా రోడ్డుపక్కన రైతులు మిర్చీ బస్తాలు పెట్టుకొని కూర్చొని ఉండగా, నేడో రేపో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్న మాటలు మిర్చి రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. 

సిఎం కేసీఆర్‌ రైతుల సమస్యలను పరిష్కరించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ యార్డు అధికారులు కూడా అదేవిధంగా చొరవ తీసుకొని వెంటనే గిట్టుబాటు ధరలకు మిర్చి కొనుగోళ్ళు జరిగేలా చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే, ఈ సమస్యను కూడా ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా పరిష్కరించలేరు కదా? 

       



Related Post