మోడీపై ప్రియాంకా పోటీ?

April 18, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిద్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈసారి ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా వాద్రా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే గొప్ప సంచలన విషయమే అవుతుంది. పార్టీ ఆదేశిస్తే తాను వారణాసి నుంచి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని ప్రియాంకా వాద్రా స్వయంగా చెప్పారు. ఆమె సోదరుడు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అటువంటి సంకేతాలే ఇస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు “ఆమెను వారణాసి నుంచి పోటీ చేయిస్తారా?’ అని  విలేఖరులు అడిగిన ప్రశ్నకు ‘అది సస్పెన్స్...ఇప్పుడే చెప్పదలచుకోలేదు,” అని జవాబిచ్చారు. ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా కూడా ఆమె ఎన్నికలలో పోటీ చేయబోతున్నారన్నట్లు మాట్లాడారు. 

కనుక వారణాసి నుంచి కాకపోయినా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఈసారి ప్రియాంకా వాద్రా పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తే మోడీ, ప్రియాంకాలలో ఎవరు ఓడిపోయినా వ్యక్తిగతంగా వారికీ...రాజకీయంగా వారి పార్టీకి కూడా చాలా అవమానకరమే అవుతుంది కనుక అప్పుడు రెండు పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతాయి. 

ఆమాద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత ఎన్నికలలో వారణాసి నుంచి నరేంద్రమోడీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదనే సాధారణంగా ఇద్దరు పెద్ద నాయకులు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయరు. కానీ ఈసారి ప్రియాంకా వాద్రా పోటీ చేస్తే ఈ సార్వత్రిక ఎన్నికలలో వారణాసి నియోజకవర్గం హైలైట్ గా నిలుస్తుంది.


Related Post