రెవెన్యూ ఉద్యోగులలో కలకలం

April 18, 2019


img

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో సమగ్ర భూసర్వే నిర్వహించి, భూరికార్డులను ప్రక్షాళన చేసి రైతుల యాజమాన్య హక్కులను దృవీకరించే పాసుపుస్తకాలను అందజేస్తోంది. ఎప్పటికప్పుడు ఆ వివరాలను ప్రజలందరికీ అనుబాటులో ఉంచేందుకు ధరణి వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ పాసుపుస్తకాల ఆధారంగానే రైతుబందు పధకాన్ని వర్తింపజేస్తోంది.

కానీ రెవెన్యూశాఖలో కొందరు అవినీతిపరులు, అసమర్ధుల కారణంగా ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. వారి కారణంగా పలుజిల్లాలలో రైతన్నలు నానా కష్టాలుపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కొందరు రైతులు తమ సమస్యలను సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళడంతో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావని భావించి అందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. రెవెన్యూ శాఖను రద్దు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తుండటంతో ఆ శాఖ ఉద్యోగులలో కలవరం మొదలైంది. 

దీనిపై వీఆర్వోల సంఘం నిన్న అత్యవసరంగా యాదగిరిగుట్టలో సమావేశమయ్యింది. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ తొందరపాటుతో వ్యవస్థలో చేసే మార్పుల వలన యావత్ రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుందని వీఆర్వోల సంఘం అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఆదాయ వనరులను సమకూర్చేవాటిలో రెవెన్యూ శాఖ చాలా కీలకమైందని, దానిని రద్దు చేస్తే ప్రభుత్వమే తీవ్ర ఇబ్బందులలో చిక్కుకొంటుందని అన్నారు. ఇటువంటి తొందరపాటు నిర్ణయాల వలన గ్రామస్థాయిలో చాలా సమస్యలు ఏర్పడతాయని బాణాల రాంరెడ్డి హెచ్చరించారు. 

ఈ సమస్యకు మరో కోణంలో నుంచి చూస్తే రైతుల పేర్లను, భూమి వివరాలను పాసు బుక్కులో నమోదు చేయాలంటే లంచం...నమోదు చేసిన ఆ పాసు బుక్కులు ఇవ్వలంటే లంచం...ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా పాసుపుస్తకాలలో తప్పులు దొర్లితే వాటిని సవరించేందుకు కూడా లంచం...ఇల్లు, స్థలం పొలం ఏది కొనాలన్నా అమ్ముకోవాలన్నా రిజిస్టార్ ఆఫీసులో లంచాలు ముట్టజెప్పవలసిందే.. లంచం ఈయనిదే ఏ పని జరుగదనేది బహిరంగ రహస్యమే. ఈ లంచాలతో సదరు రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు రెండు చేతులా బాగానే సంపాదించుకొంటుంటారు కానీ ప్రజలందరూ ప్రభుత్వాన్నే వేలెత్తి చూపించి నిందిస్తుంటారు. కనుక రెవెన్యూ ఉద్యోగ సంఘాల నుంచి ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనప్పటికీ లోపభూయిష్టమైన, అవినీతి కంపుకొడుతున్న రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని సిఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రజలకు న్యాయం చేయాలనే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం మంచిదే. కానీ దీని వలన ప్రభుత్వానికి, రెవెన్యూఉద్యోగులకు మద్య దూరం పెరుగుతుందని బాణాల రాంరెడ్డి హెచ్చరించారు. Related Post