తెరాస ప్రభుత్వంపై నాగం ఒంటరి పోరాటం దేనికో?

July 22, 2016


img

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. ఆ పార్టీల నేతలందరూ తమ తమ పార్టీల తరపునే పోరాడుతున్నారు తప్ప ఎవరూ వ్యక్తిగతంగా పోరాడటం లేదు. ఆ అవసరం లేదు కూడా. కానీ భాజపా నేత నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం పార్టీ తో సంబంధంలేనట్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఆయన దాని గురించి భాజపాకి తెలిపి అనుమతి కోర లేదు. అలాగే రాష్ట్ర భాజపా అధిష్టానం కూడా ఆయన చేస్తున్న పోరాటం గురించి మాట్లాడటం లేదు. కనుక అది ఆయన వ్యక్తిగతంగా చేస్తున్న పోరాటంగానే భావించవలసి ఉంటుంది. అందుకు బలమైన కారణమే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెరాసలో చేరాలనే ఆశతో తెదేపాని వదులుకొని బయటకి వచ్చిన నాగం కి, కెసిఆర్ ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకలేదు. పైగా ఆయన తెలంగాణ రాజకీయ జేఏసిలోకి కూడా ప్రవేశించకుండా అడ్డుకొన్నారు. అప్పటి నుంచే కెసిఆర్ పై నాగం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఆ తరువాత నాగం భాజపాలో చేరారు కానీ అందులో కూడా ఆయన ఆశించిన గౌరవం, గుర్తింపు పొందలేకపోయారు. అప్పుడు తన అనుచరుడుతో ‘బచావ్ తెలంగాణ’ ఫోరాన్ని స్థాపింపజేసి దాని ద్వారా తెరాసపై యుద్ధం చేద్దామని ప్రయత్నించారు. కానీ భాజపాలో సభ్యుడిగా ఉంటూ వేరు కుంపటి పెట్టుకొన్నందుకు భాజపా అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్ళీ భాజపాతో కలిసి పని చేయడానికి ప్రయత్నించినా, అక్కడ ఇమడలేకపోతున్నారు.

అయితే వేరే ప్రత్యమ్నాయం ఏదీ లేకపోవడం చేత ప్రస్తుతం దానిలోనే కొనసాగుతున్నారు. ఆయనని భాజపా పట్టించుకోవడం లేదు కనుక తన ఉనికిని చాటుకొనేందుకే తెరాస ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ నాగం వేరే కారణం చెపుతుంటారు.

గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులలో మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయించకుండా, రీ డిజైనింగ్ పేరిట కెసిఆర్ వందల కోట్లు అవినీతికి పాల్పడుతున్నారని నాగం ఆరోపించారు. విభజన తరువాత మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని అవినీతి ప్రాజెక్టులతో అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని నాగం విమర్శించారు.  ప్రాజెక్టులు పేరు చెప్పి కెసిఆర్ చాలా అవినీతికి పాల్పడుతున్న చేత ఆ అవినీతి సొమ్ము అంతా కక్కించడానికే న్యాయపోరాటం చేస్తున్నానని నాగం చెప్పుకోగా, అది సాధ్యం కాదని న్యాయపోరాటం పేరుతో మీడియా దృష్టిని తద్వారా ప్రజలని ఆకర్షించేందుకే నాగం జనార్ధన రెడ్డి తిప్పలన్నీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నాగం, ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడం కోసం పోరాటాలు చేస్తుండటం చూస్తే ఎవరైనా అయ్యో పాపం..నాగం అని జాలిపడకమానరు.


Related Post