రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటో?

April 17, 2019


img

పదేళ్ళు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవి చేపట్టమంటే భయపడిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ పదవి కోసం చాలా ఆరాటపడుతుండటం చూస్తే ఎవరైనా నవ్వకమానరు. రాహుల్ గాంధీ ధైర్యం చేస్తున్నారు కనుక ఇప్పుడైనా ప్రధానమంత్రి అవుతారా? అంటే అనుమానమే. ఎందుకంటే, ఈసారి కూడ మళ్ళీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కాకుంటే హంగ్ పార్లమెంటు ఏర్పడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని ఏ ఒక్క సర్వే చెప్పలేదు. 

గత ఎన్నికలలో మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది కానీ ఈసారి దేశవ్యాప్తంగా మోడీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి కొత్తగా కొన్ని ప్రాంతీయపార్టీలు కూడా కలిసి వస్తున్నాయి. అయినప్పటికీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమేనని సర్వేలు చెపుతున్నాయి. 

ఒకవేళ సర్వేలు చెప్పినట్లు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అప్పుడు మళ్ళీ పార్లమెంటు ప్రతిపక్ష బెంచీలలో కునికిపాట్లుపడుతూ, మరో 5 ఏళ్ళు కాలక్షేపం చేయకతప్పదు. కానీ రాహుల్ గాంధీ ఇక ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేకపోవచ్చు.

ఒకవేళ ప్రాంతీయపార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకొన్నా, ప్రభుత్వ ఏర్పాటు కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయకతప్పదు. ఒకవేళ అదే జరిగి రాహుల్ గాంధీ అందుకు సిద్దపడితే, మమతా బెనర్జీ లేదా మాయావతి లేదా మరొకరి క్రింద కేంద్రమంత్రిగా పనిచేయడానికి సిద్దపడవలసిరావచ్చు. లేదా ఏ పదవి తీసుకోకుండా తల్లి సోనియా గాంధీలాగే బయట నుంచి రిమోట్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపించవచ్చు. మరి రాహుల్ గాంధీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడితే కానీ తెలియదు.


Related Post