దొంగలందరి పేర్లలో మోడీ ఉందేంటి? రాహుల్ ప్రశ్న

April 17, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాదొక ప్రశ్న. దొంగలందరి పేర్లలో మోడీ అనే పదం ఎందుకు ఉంటోంది? అది లలిత్ మోడీ కావొచ్చు...నీరవ్ మోడీ కావొచ్చు లేదా నరేంద్రమోడీ కావొచ్చు...ఇంకా ఎంతమంది మోడీల పేర్లు బయటకు వస్తాయో?” అని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలలో గెలిచి ప్రధానమంత్రి కావాలనుకొంటున్న రాహుల్ గాంధీ దేశ ప్రధానిని ఉద్దేశ్యించి అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పే. 

రాహుల్ గాంధీ తనను దొంగ అన్నందుకు ప్రధాని నరేంద్రమోడీ బాధపడలేదు కానీ రాహుల్ గాంధీ బీసీలను అవమానించినందుకు ఎక్కువ బాధపడుతున్నానని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఇటువంటి అవమానాలు ఎదుర్కోవడం అలవాటేనని, కానీ బీసీలందరూ దొంగలేనన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడటమే తనను ఎక్కువ బాధించిందని నరేంద్రమోడీ అన్నారు. 

“నేను బీసీ వ్యక్తిని. నన్ను దొంగ అంటే మీ అందరినీ కూడా దొంగ అన్నట్లే” అంటూ నరేంద్రమోడీ తన కులం ప్రస్తావన చేసి బీసీలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించడం, వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం రెండూ కూడా పొరపాటేనని చెప్పకతప్పదు. 

నరేంద్రమోడీ తన హయాంలో చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పుకొని ప్రజలను ఓట్లు అడిగి ఉంటే బాగుండేది. కానీ ప్రధాని వంటి అత్యున్నత హోదాలో ఉన్న ఆయన కూడా ఒక గల్లీ స్థాయి రాజకీయనాయకుడిలాగా కులం పేరు చెప్పుకొని ఓట్లు అడగడం చాలా శోచనీయం.


Related Post