నిజామాబాద్‌ రైతుల ఆందోళన ఫలించిందా?

April 17, 2019


img

నిజామాబాద్‌ జిల్లాలోని పసుపు, ఎర్రజొన్న రైతులు తమ పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గత రెండున్నర నెలలుగా ఎన్ని రకాలుగా నిరసనలు తెలిపినప్పటికీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో 176 మంది రైతులు నామినేషన్లు వేసి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు. 

నిజానికి ఇది వారొక్కరి సమస్యే కాదిది రాష్ట్రంలో ప్రతీ రైతన్న ఎదుర్కొంటున్న సమస్యే. ఎండనక... వాననక, రేయనక.. పగలనక... కష్టపడి అప్పులు తెచ్చి మరీ పండించి పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డులకు వెళితే అక్కడ గిట్టుబాటు ధర లభించదు. అధికారులు ఉన్నప్పటికీ అక్కడ దళారులు ఎంత చెపితే అంత అన్నట్లు నడుస్తుంది. పంట ఏదైనప్పటికీ రైతులు దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. నష్టపోతూనే ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. 

ఒకపక్క రైతులు కారుచవకగా తమ పంటలను దళారులకు అమ్ముకొంటుంటే, మరోపక్క నగరాలు, పట్టణాలలో నివసిస్తున్న వినియోగదారులు అవే ఉత్పత్తులకు అనేక రెట్లు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయవలసి వస్తోంది. అంటే అటు రైతులు, ఇటు వినియోగదారులు నష్టపోతుంటే, మద్యలో దళారులు చేతికి మట్టి అంటకుండా లాభాలు గడిస్తున్నారన్నమాట! 

ఇదంతా ప్రభుత్వానికి దానిలో పనిచేసే వేలాదిమంది అధికారులకు తెలియదా? ప్రజలు, రైతులు నష్టపోకుండా వారు ఏమీ చేయలేరా?అసలు ఏమైనా చేస్తున్నారా? అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించదు. 

కనుక ఈ సమస్యలపై కూడా మళ్ళీ సిఎం కేసీఆర్‌ స్వయంగా దృష్టి సారించవలసి వచ్చింది. మంగళవారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, వ్యవసాయ శాఖ, ఉద్యానవాన శాఖ, మార్కెటింగ్ శాఖ ప్రధానకార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

“రాష్ట్రంలో 1.2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం అనేక సాగునీటిపధకాలను చేపట్టింది. త్వరలో వాటిలో కొన్ని పూర్తి కాబోతున్నాయి. సాగునీరు అందుబాటులోకి వస్తే పంటల దిగుబడులు బారీగా పెరుగుతాయి. కానీ వాటికి గిట్టుబాటు ధర కల్పించలేకపోతే ప్రభుత్వం చేస్తున్న ఈ భగీరధ ప్రయత్నమంతా వృధా అవుతుంది. కనుక రైతులు విత్తనం నాటినప్పటి నుంచి తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకువచ్చేవరకు ప్రతీ దశలోను శాస్త్రీయ పద్దతులు అవలంభించవలసి ఉంటుంది. వారి ఉత్పత్తులకు సకాలంలో సరైన ధరలు చెల్లించేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థను తీర్చి దిద్దుకోవలసి ఉంటుంది. ఎప్పుడు ఏ పంటను ఎంత పండిస్తే రైతులకు లాభం కలుగుతుందో వంటి వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు అందించేవిధంగా వ్యవస్థలు రూపొందించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు నాలుగూ పరస్పర అవగాహనతో పనిచేసినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. కనుక తదనుగుణంగా ఈ నాలుగు శాఖల అధికారులు ఒక సమగ్ర ప్రణాళికను సిద్దం చేయాలి,” అని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ అధికారులకు అనేక విలువైన సూచనలు చేశారు. రైతులకు మేలు చేయాలని సిఎం కేసీఆర్‌ గట్టిగానే అనుకొంటున్నారు. కానీ అదే తపన, పట్టుదల, దూరదృష్టి అధికారులలో కూడా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.


Related Post