చంద్రబాబు ఓడిపోబోతున్నారా?

April 15, 2019


img

ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి ఓడిపోబోతోందని, సిఎం చంద్రబాబునాయుడు మే 22వరకు మాత్రమే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలరని ఆ మరుసటిరోజు కుర్చీలో నుంచి దిగిపోక తప్పదని జగన్, కేసీఆర్‌, కేటీఆర్‌ బల్లగుద్దివాదిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబునాయుడు కూడా గ్రహించబట్టే ఈవీఎంలను, ఎన్నికల కమీషన్‌ను నిందిస్తున్నారని, డిల్లీలో డ్రామా ఆడారని వాదిస్తున్నారు. జగన్‌ ఏపీ ముఖ్యమంత్రి కావడం తధ్యమని కేసీఆర్‌, కేటీఆర్‌, వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగకుండా నిరోదించాలని టిడిపి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ భారీ సంఖ్యలో ఓటర్లు తరలి వచ్చి (వైసీపీకి?) ఓట్లు వేశారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.   

కానీ సిఎం చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు ఇందుకు పూర్తి భిన్నమైన వాదన వినిపిస్తుండటం విశేషం. మోడీ కనుసన్నలలో పనిచేస్తున్న ఎన్నికల సంఘం రాష్ట్రంలో వైసీపీకి ఎన్నికలలో లబ్ది కలిగించాలనే ఉద్దేశ్యంతోనే పోలింగ్ సమయంలో చాలా నిర్లక్ష్యంగా, పక్షపాతధోరణితో వ్యవహరించిందని చంద్రబాబునాయుడు వాదిస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ భౌతిక దాడులకు, పోలింగ్ స్టేషన్లో విద్వంసాలకు పాల్పడిందని వాదిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మోడీ, కేసీఆర్‌, జగన్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికే ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారని, ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఓటర్లు అర్ధరాత్రి దాటి మరుసటిరోజు తెల్లవారుజాము వరకు క్యూ లైన్లో నిలబడి (టిడిపికి?) ఓట్లు వేశారని చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు గట్టిగా వాదిస్తున్నారు.

ఒకవేళ జగన్, కేసీఆర్‌, కేటీఆర్‌ వాదనలు నిజమైతే ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సంబంధాలను పునర్నిర్వచించుకొనే సమయం ఆసన్నమైనట్లే. ఒకవేళ చంద్రబాబునాయుడు, టిడిపి నేతల వాదనలు నిజమై, మళ్ళీ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అయితే మరో 5 ఏళ్ళ వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య యధాతధా ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. కనుక ఈ ఇరుపక్షాల వాదనలలో ఎవరి వాదన నిజమనే విషయం తెలియాలంటే మే 23వరకు వేచి చూడక తప్పదు.


Related Post