కేసీఆర్‌కు రాజాసింగ్ ఆఫర్

April 15, 2019


img

బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తెరాసలో చేరేందుకు సిద్దం అంటున్నారు. తెరాసలో చేరేందుకు తనకు మంత్రిపదవులక్కరలేదు కానీ అయోద్యలో రామమందిరం నిర్మాణం కోసం తాము చేస్తున్న ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇవ్వాలని షరతు పెట్టారు. అలాగే మతమార్పిడులను వ్యతిరేకిస్తూ, గోవధ నిషేధం కొరకు తాము చేస్తున్న పోరాటాలకు మద్దతు ప్రకటించాలని కోరారు. 

శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌ నగరంలో శ్రీరామ శోభాయాత్ర జరిగింది. ఈ సందర్భంగా సుల్తాన్ బజార్ వద్ద జరిగిన సభలో రాజాసింగ్ మాట్లాడుతూ కేసీఆర్‌కు ఈ ప్రతిపాదన చేశారు. “దేశంలో ఇప్పుడు ‘జైశ్రీరామ్’ అంటే మతోన్మాది ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వందేమాతరం..భారత్‌ మాతాకీ జై’ అని పలకడానికి ఇష్టపడనివారందరూ గొప్ప సెక్యులర్ వాదులుగా చలామణి అవుతున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.  

రాజాసింగ్ బిజెపిలోనే ఇమడలేక చాలా ఇబ్బందిపడుతున్నారు. తనవంటి కరడుగట్టిన హిందుత్వవాది తెరాసకు అవసరంలేదనే సంగతి ఆయనకు కూడా తెలుసు. ఇక ఆయన ఆఫర్ పేరిట సిఎం కేసీఆర్‌కు విసిరిన సవాళ్ళు గురించి మాట్లాడుకొంటే... 

ఎన్నికలొచ్చినప్పుడే బిజెపికి అయోద్య రామమందిరం గుర్తొస్తుందనే సంగతి అందరికీ తెలుసు. కనుక బిజెపి రామమందిరం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని స్పష్టం అవుతోంది. అలాగే రాష్ట్రంలో తెరాస కూడా ముస్లిం ఓట్ల కోసమే మజ్లీస్ పార్టీతో దోస్తీ చేస్తోందని అందరికీ తెలుసు. 

మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా అయోద్యలో రామమందిరం నిర్మాణం చేస్తుందా లేదా?అనే విషయాన్ని పక్కనపెడితే రాజాసింగ్ కేసీఆర్‌కు విసిరిన ఈ సవాలుకు తెరాసలో ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేరు. రామమందిరం నిర్మించాలని తెరాస సూటిగా సమాధానం చెపితే మజ్లీస్ పార్టీ...దానితో పాటు రాష్ట్రంలో ముస్లింలు కూడా తెరాసకు దూరం అవుతారు. మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని చెపితే హిందువులకు ఆగ్రహం కలుగుతుంది. అందుకే రామమందిరం కంటే దేశంలో చాలా ముఖ్యమైన సమస్యలున్నాయని, దమ్ముంటే వాటి గురించి మాట్లాడాలని సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీకి సవాలు విసిరి లౌక్యంగా తప్పించుకొన్నారు. 

గోవధ నిషేధం కోసం ఉద్యమిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న రాజాసింగ్, ముందుగా తమ పార్టీ అధికారంలో ఉన్న గోవా, మహారాష్ట్ర, అస్సోం, నాగాలాండ్, మణిపూర్ తదితర రాష్ట్రాలలో దానిని ఎందుకు అమలుచేయడంలేదో చెప్పగలిగితే బాగుంటుంది. ఈ విషయంలో రాజాసింగ్ కేసీఆర్‌కు సవాలు విసిరే బదులు ముందుగా తమ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించగలిగితే బాగుంటుంది కదా? 


Related Post