ఈసారి ఆమె ఓడిపోవడం తద్యం: కె.లక్ష్మణ్

April 13, 2019


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ శనివారం హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “నిజామాబాద్‌ తెరాస అభ్యర్ధి కవిత ఈసారి మా బిజెపి అభ్యర్ధి అరవింద్ చేతిలో ఓడిపోబోతున్నారు. ఆమె రైతులకు న్యాయం చేయకపోగా ఆమె, ఆమె సోదరుడు కేటీఆర్‌ ఇద్దరూ కూడా జిల్లాలో రైతుల పట్ల అవహేళనగా మాట్లాడి వారిని నొప్పించారు. కనుకనే జిల్లాలో 176 మంది రైతులు ఆమెపై తిరుగుబాటు చేస్తూ ఎన్నికలలో పోటీ చేశారు. రైతుల ఆగ్రహానికి గురైన ఆమె ఈసారి ఎన్నికలలో ఓడిపోవడం తద్యం. సిఎం కేసీఆర్‌ కూడా రాష్ట్రంలో మైనార్టీ ఓట్ల కోసం హిందువులను ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడారు. ఓవైసీని ప్రసన్నం చేసుకోవడం కోసం కేసీఆర్‌ ఇంతగా దిగజారాలా? ఈసారి రాష్ట్రంలో బిజెపికి ఓట్లు శాతంతో పాటు సీట్లు కూడా పెరుగబోతున్నాయి” అని అన్నారు.  

నిజామాబాద్‌ జిల్లా రైతులు తెరాస సర్కారుపై, ఎంపీ కవితపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవం. ఆ కోపంతోనే 176 మంది రైతులు ఎన్నికలలో పోటీకి దిగారు కనుక జిల్లాలో రైతు కుటుంబాలు వారికే ఓట్లు వేసి ఉండవచ్చు. ఇక జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మధుయాష్కీ గౌడ్ చాలా బలమైన అభ్యర్దే. తెలంగాణలో బిజెపికి నిజామాబాద్‌ జిల్లాపైనే కాస్త ఎక్కువ పట్టుంది. 

కనుక ఈసారి కవితకు కాంగ్రెస్, బిజెపి, రైతుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని ఉండవచ్చు. కానీ బిజెపి అభ్యర్ధి చేతిలో ఆమె ఓడిపోతారనుకోవడం అత్యాశే అవుతుంది. ఈసారి గట్టి పోటీ ఉన్నందున ఆమెకు మెజార్టీ తగ్గవచ్చు కానీ గెలవడం తద్యమనే భావించవచ్చు. ఈసారి 17 లోక్‌సభ స్థానాలలో బిజెపి కనీసం రెండు సీట్లు గెలుచుకోగలిగినా అది చాలా గొప్ప విషయమే అవుతుంది.


Related Post