కాంగ్రెస్‌, తెరాసలకు బిజెపి ప్రత్యామ్నాయం కాగలదా?

April 13, 2019


img

 గత 5 ఏళ్ళలో దేశంలో అనేక రాష్ట్రాలలో బిజెపి వ్యాపిస్తోంది కానీ తెలంగాణలో మాత్రం బిజెపి పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఇంతదయనీయంగా మారడం చాలా ఆశ్చర్యకరమే. కనుక ఈసారి కూడా తెలంగాణలో బిజెపి ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్ర బిజెపి దుస్థితి బిజెపి అధిష్టానం, రాష్ట్ర నేతల స్వయంకృతపరాధమేనని చెప్పకతప్పదు. 

సిఎం కేసీఆర్‌తో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, బండారు దత్తాత్రేయ తదితరులు సన్నిహితంగా మెలగడం వలన ఆ రెండు పార్టీల మద్య అవగాహన ఉందనే భావన రాష్ట్ర ప్రజలకు కలుగుతుందనే విషయాన్ని వారు విస్మరించారు. దీని వలన తెరాసకు కూడా కొంత నష్టం జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ దాని నుంచి ఏవిధంగా బయటపడాలో కేసీఆర్‌కు బాగా తెలుసు కనుకనే మోడీతో దోస్తీకి ఆయన భయపడలేదు. ఒకపక్క మోడీతో మరోపక్క మజ్లీస్ పార్టీతో దోస్తీ చేస్తూనే వరుస విజయాలు సాధిస్తుండటమే ఆయన రాజకీయ చతురతకు గొప్ప నిదర్శనం. 

సాధారణంగా రాజకీయ శత్రువులను రాజకీయంగానే ఎదుర్కొని దెబ్బతీసి వారిపై పైచేయి సాధిస్తుంటారు. కానీ కేసీఆర్‌ మాత్రం మోడీతో స్నేహం చేస్తూ రాష్ట్రంలో బిజెపిని దెబ్బ తీసి ఎదగకుండా చేయగలిగారు. మోడీ-కేసీఆర్‌ దోస్తీ కారణంగా కేసీఆర్‌...తెరాస సర్కారుపై రాష్ట్ర బిజెపి నేతలు చేస్తున్న విమర్శలకు అర్ధం, విలువ లేకుండా పోయాయి. 

రాజకీయాలలో ఉన్నవారు ప్రత్యర్ధి బలం అంచనా వేయడంలో విఫలమైనప్పటికీ కనీసం సొంత బలానైనా సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. కానీ రాష్ట్ర బిజెపి నేతలు అందులోనూ విఫలం  అయ్యారని ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలే చెపుతున్నాయి. తెరాస ఎల్లప్పుడూ ‘ఎన్నికల మోడ్’ లోనే ఉంటుంది కనుక ఎన్నికల కోసం 2-3 ఏళ్ళు ముందు నుంచే కసరత్తు మొదలుపెడుతుంది. కానీ రాష్ట్ర బిజెపి మాత్రం 2-3 నెలల ముందుగా మాత్రమే కసరత్తు మొదలుపెడుతుంటుంది. ఎన్నికలు దగ్గర పడిన తరువాత అభ్యర్ధుల కోసం వెతుకులాడుతుంది.

ప్రజలు పెద్దగా పట్టించుకోని తెలంగాణ విమోచన దినోత్సవం గురించి, నరేంద్రమోడీ పరిపాలన గురించి చెప్పుకోవడానికే రాష్ట్ర బిజెపి నేతలు పరిమితం అయ్యారు తప్ప రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకోలేకపోయారు. కనుక రాష్ట్రంలో బిజెపి ప్రస్తుత పరిస్థితికి వారి అధిష్టానం, రాష్ట్ర బిజెపి నేతలు సమానంగా భాద్యత వహించాల్సి ఉంటుంది. 

లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బిజెపి కనీసం 2-3 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగితే బిజెపి కోలుకోగలదు లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో నుంచి మాయమైపోయినా ఆశ్చర్యం లేదు. 


Related Post