ఏపీకి ఆయనే సిఎం కాబోతున్నారా?

April 13, 2019


img

సుమారు 11 ఏళ్ళ క్రితం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మృతి చెందినప్పటి నుంచి ఏపీకి ముఖ్యమంత్రి కావాలని పరితపించిపోతున్న ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డికి 2014 ఎన్నికలలో తృటిలో ఆ అవకాశం చేజార్చుకొన్నారు. కనుక ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో గెలిచి తన కళను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో తన ముందు ఉన్న అన్ని మార్గాలను, అవకాశాలను ఉపయోగించుకొన్నారు. వాటిలో ఒకటి ఎన్నికల వ్యూహనిపుణుడుగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ బృందం సేవలు. వారి బృందం హైదరాబాద్‌ నగరంలో ‘ఐ-ప్యాక్’ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేసుకొని గత రెండేళ్ల నుంచి ఏప్రిల్ 11న పోలింగ్ పూర్తయ్యేవరకు వారు వైసీపీ కోసం పనిచేస్తున్నారు. వారు సూచించిన ఎన్నికల వ్యూహాల కారణంగా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తప్పకుండా విజయం సాధించి, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారనే నమ్మకం ఆ పార్టీ నేతలలో ప్రస్పుటంగా కనిపిస్తోంది. 

తమ విజయం కోసం ఎంతగానో కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ బృందానికి జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలుపుకొన్నారు. వారిని కలిసేందుకు ఆయన నిన్న సాయంత్రం ‘ఐ ప్యాక్’ కార్యాలయానికి వచ్చినప్పుడు వారందరూ చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశ్యించి ‘సిఎం సార్’ అంటూ పలుకరించారు. జగన్‌మోహన్‌రెడ్డి వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. తన కలను సాకారం చేయడానికి సహకరించిన ప్రశాంత్ కిషోర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ధన్యవాదాలు తెలిపారు. 

ప్రశాంత్ కిషోర్ గతంలో నరేంద్రమోడీ (బిజెపి), నితీశ్ కుమార్ (జెడి-యు)ల కోసం పనిచేసి వారి విజయానికి దోహదపడ్డారు. తరువాత యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు కానీ ఆయన వ్యూహాలు ఫలించలేదు. కాంగ్రెస్ పార్టీ బిజెపి చేతిలో ఓడిపోయింది. 

ఆ తరువాత ఏపీలో వైసీపీకి సేవలు అందించారు. ఈసారి వైసీపీ తప్పకుండా విజయం సాధించి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రశాంత్ కిషోర్ బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈసారి జగన్‌మోహన్‌రెడ్డికి అన్నీ కలిసివచ్చాయి కూడా కనుక ఆయనే ఏపీకి ముఖ్యమంత్రి అవుతారేమో? మే 23న ఫలితాలు వెలువడితే కానీ తెలియదు. Related Post