ఖమ్మంలో నేనే గెలవబోతున్నా ఎందుకంటే....

April 13, 2019


img

ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన కాంగ్రెస్‌ రేణుకా చౌదరి ఈసారి ఎన్నికలలో తానే తప్పకుండా విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఆమె నిన్న ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్‌... అక్కడ కేంద్రంలో నరేంద్రమోడీ ఇద్దరూ నియంతృత్వపాలన చేస్తున్నారు. ఇద్దరూ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేయడం తప్ప చేసిందేమీ లేదు. కనుక కేసీఆర్‌, నరేంద్రమోడీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. అది ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలించబోతోంది. రాష్ట్ర ప్రజలందరూ మావెంటే ఉన్నారని గొప్పలు చెప్పుకొంటున్న తెరాస ఖమ్మంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టవలసిన అవసరం ఏమిటి? తెరాస అభ్యర్ధి ఓటర్లను ఎంతగా ప్రలోభపెట్టినా ఖమ్మంలో నేనే గెలవబోతున్నాను. ఖమ్మంతో సహా రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోబోతోంది. అదేవిధంగా జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తధ్యం,” అని అన్నారు. 

ఖమ్మంలో రేణుకా చౌదరితో తెరాస అభ్యర్ధి నామా నాగేశ్వరరావు పోటీ పడ్డారు. అయితే ఆయన మొదటి నుంచి తెరాసలో ఉండి ఉంటే ప్రజలు కూడా ఆయనను తెరాస నేతగానే చూసి ఉండేవారు. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికలు టిడిపి పోటీ చేయకూడదని నిర్ణయించేసరికి, కేవలం టికెట్ కోసమే తెరాసలో చేరినా సంగతి అందరికీ తెలుసు. నిన్నమొన్నటి వరకు టిడిపి నేతగా ఉన్న ఆయనను తెరాస అభ్యర్ధిగా ప్రజలు అంగీకరిస్తారా? అంటే అనుమానమే. 

హటాత్తుగా ఊడిపడిన నామా కోసం తెరాస సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ పక్కన పెట్టడంతో ఆయన, అనుచరులు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా టిడిపిలో ఉన్నప్పుడు నామాతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తుమ్మల నాగేశ్వరరావు కూడా తెరాసలోకి నామా రాకను వ్యతిరేకించడం సహజమే. 

కేసీఆర్‌ ఆదేశాలకు తలొగ్గి వారిరువురూ నామా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, వారు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరిస్తారనుకోలేము. నామా ఆర్ధికంగా, రాజకీయంగా ఎంత బలవంతుడైనప్పటికీ ఇటు పార్టీలో, అటు ప్రజలలోను వ్యతిరేకత మూటగట్టుకొన్న కారణంగా రేణుకా చౌదరి చేతిలో పరాజయం పాలయ్యే అవకాశం ఉంది.


Related Post