చంద్రబాబు డిల్లీ వెళ్ళి ఏమి సాధిస్తారో?

April 12, 2019


img

ఏపీ సిఎం చంద్రబాబునాయుడు శనివారం డిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ సునీల్ అరోరా, ఇద్దరు కమీషనర్లను కలువబోతున్నారు. రాష్ట్రంలో నిన్న జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంలు పనిచేయకపోవడం, ఒక గుర్తుకు ఓటేస్తే మరొక గుర్తుకు పడుతుండటం, పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలు, దాడులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం గురించి చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్లకు ఫిర్యాదు చేయనున్నారు.

కానీ ప్రధాని నరేంద్రమోడీ కనుసన్నలలో కేంద్ర ఎన్నికల సంఘం, దాని చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తున్నాయని చంద్రబాబునాయుడు స్వయంగా ఆరోపిస్తున్నప్పుడు, ఎన్నికల సంఘం అవకతవకల గురించి మళ్ళీ వారికే మొర పెట్టుకొంటే ప్రయోజనం ఉంటుందనుకోవడం అత్యాశే అవుతుంది. పైగా ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రులను ఇదివరకులాగా నేరుగా కలిసి మాట్లాడలేని పరిస్థితిని కల్పించుకొన్నందున, డిల్లీలో ఆయనకు సహకరించేవారెవరూ ఉండరు. ఒకవేళ కేంద్ర ఎన్నికల కమీషనర్ సానుకూలంగా స్పందించనట్లయితే ఆయన ఎన్నికల సంఘం కార్యలయం ముందే దాని వైఖరిని నిరసిస్తూ చంద్రబాబునాయుడు రేపు ధర్నా చేయాలనుకొంటున్నట్లు సమాచారం. 

ఈవిధంగా రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని డిల్లీలో జాతీయమీడియా, జాతీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన కావచ్చు. కానీ దాని వలన ఏమైనా ఫలితం, మార్పు ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ సమస్యను చంద్రబాబు సరిగ్గా హైలైట్ చేయగలిగితే ఉత్తరాది రాష్ట్రాలలో త్వరలో జరుగబోతున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ఎంతో కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

చంద్రబాబు డిల్లీలో చేయబోతున్న హడావుడిపై వైసీపీ నేతలు స్పందిస్తూ, “ఆయనకు ఓటమి భయం పుట్టుకొంది. ఆ భయంతోనే డిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు,” అని అన్నారు. కనుక రాజకీయంగా డిల్లీలో పూర్తివ్యతిరేక వాతావరణం నెలకొన్న ఈ సమయంలో చంద్రబాబునాయుడు అక్కడకు వెళ్ళి ఏమి సాధిస్తారో చూడాలి.


Related Post