తెరచాటు యుద్దం ఎందుకు? పవన్‌ కల్యాణ్‌

March 23, 2019


img

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏలూరు, భీమవరం ఎన్నికల ప్రచారంలో తెరాస, టిడిపి, వైసీపీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెరాసను ఉద్దేశ్యించి, “జనసేనలో చేరాలని వచ్చిన కొందరు నాయకులు చాలా మంది వెనక్కు తగ్గారు. ఎందుకంటే, హైదరాబాద్‌లో మాకు ఆస్తులు ఉన్నాయి. ఇబ్బందులు వస్తాయని చెప్పేవారు. వారు చెప్పేది నాకు మొదట అర్ధం కాలేదు. కానీ వారి మాటల సారాంశం ఏమిటంటే హైదరాబాద్‌లో ఆంధ్రా నాయకుల ఆస్తులను లాగేసుకొంటామని బెదిరిస్తూ కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని. ఇదెక్కడి న్యాయం? ఇవేమి రాజకీయాలు?

ఒకప్పుడు తనపై రాళ్ళేయించిన తెరాసతోనే జగన్ ఇప్పుడు అంటకాగుతున్నారు. ఆంధ్రా ప్రజల పట్ల, నాయకుల పట్ల కేసీఆర్‌ చాలా చులకనభావం ప్రదర్శిస్తుంటారు. అటువంటి వ్యక్తితో, పార్టీతో జగన్ ఎందుకు అంటకాగుతున్నారు? అసలు తెరాసకు ఇక్కడ ఏపీలో ఏం పని? కావాలనుకొంటే తెరాస కూడా ఇక్కడ తమ పార్టీ అభ్యర్ధులను నిలబెట్టి పోటీ చేయాలి కానీ తెరవెనుక రాజకీయాలు ఎందుకు చేస్తోంది?తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడకు వచ్చి ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? అటువంటి నేతలను ఇక్కడి ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించాలి,” అంటూ విరుచుకుపడ్డారు. 

టిడిపిని, ఏపీ సిఎం చంద్రబాబునాయుడును ఉద్దేశ్యించి కూడా పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర విమర్శలు చేశారు. “రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్ర సమస్యలలో చిక్కుకొంది కనుక రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం నిలద్రొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో జనసేన వెనక్కు తగ్గి టిడిపి-బిజెపిలకు మద్దతు ఇచ్చింది. కానీ ఈ 5 ఏళ్ళలో టిడిపి సాధించింది ఏమీ లేకపోగా ఎక్కడ చూసిన ఇసుక మాఫియాలు, అవినీతి, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. టిడిపికి మద్దతు ఇచ్చి తప్పు చేశానని నాకు అర్ధం అయ్యింది. అందుకే ఈసారి జనసేన కూడా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో దిగింది. మా పార్టీ దేశముదురు రాజకీయ నాయకులను కాకుండా చాకుల్లాంటి యువతకు టికెట్లు కేటాయిస్తోంది. మేమందరం కలిసి రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిని పారద్రోలి పారదర్శకమైన పాలన సాగించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. పార్లమెంటులో నరేంద్రమోడీని చూసి భయపడి బల్లల చాటున దాగుండే టిడిపి, వైసీపీ ఎంపీలు, పార్లమెంటులో వెనుక బెంచీలలో నిద్రపోయే ఎంపీలవంటివారిని కాకుండా పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగా నిలదీసేవారిని ఎంపికచేసి బరిలో దింపాము. కనుక ప్రజలు జనసేన అభ్యర్ధులను గెలిపించవలసిందిగా కోరుతున్నాను,” అని అన్నారు. 


Related Post