ఇద్దరు టి-కాంగ్రెస్‌ నేతలు రాజీనామా..ఏ పార్టీలోకి పయనం?

March 22, 2019


img

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ (రాజ్యసభ) రాపోలు ఆనంద్ భాస్కర్, పిసిసి ఓబీసీ కమిటీ ఛైర్మన్ చిత్తరంజన్ దాస్ ఈరోజు తమ పదవులకు, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కుంటిసాకులతో రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్లకు గౌరవం, సామాజిక సమానత్వం లేకుండా పోయిందని అందుకే పార్టీని వీడుతున్నామని చెపుతూ ఇద్దరూ తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. 

ప్రస్తుతం గాంధీభవన్‌ నుంచి బయలుదేరుతున్నవారు తెలంగాణ భవన్‌కు చేరుకొంటున్నారు కనుక వారిరువురూ కూడా అక్కడికే చేరుకొనే అవకాశం కనిపిస్తోంది. కానీ మరోపక్క బిజెపి కూడా డికె అరుణతో కాంగ్రెస్ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కనుక వారిరువురూ బిజెపిలో చేరినా ఆశ్చర్యం లేదు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ పదవులు, అధికారం అన్నీ అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకొనే ప్రయత్నం చేయకపోగా కాంగ్రెస్‌ నేతలందరూ ఈవిధంగా ఎవరిదారివారు చూసుకోవడం అవకాశవాదానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అటువంటి అవకాశవాదులను చేర్చుకొని ఏదో ఘనకార్యం సాధించినట్లు గొప్పలు చెప్పుకోవడం అంతకంటే హీనం. 

ఈ ఫిరాయింపులు చూస్తుంటే మన రాజకీయనాయకులు ఎవరికీ చట్టాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, తమను ఎన్నుకొన్న ప్రజల పట్ల గౌరవం లేదని స్పష్టం అవుతోంది. ఈవిధంగా అందరూ ఏదో ఓ కుంటిసాకుతో పార్టీలు మారడం, ఆ ఫిరాయింపులకు అందమైన పేర్లు పెట్టుకొని అవి ఒక మహత్కార్యం కోసం జరుగుతున్న చర్యలుగా అభివర్ణించడం చూస్తుంటే రాజకీయాలు ఇంతకంటే ఇంకా ఎంత కిందకు దిగజారగలవు? అనే సందేహం కలుగకమానదు.


Related Post