అప్పుడు మోడీకి ఎందుకు మద్దతు ఇచ్చామంటే...

March 22, 2019


img

తెరాస నిజామాబాద్‌ ఎంపీ కవిత మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. 

“కాంగ్రెస్‌, బిజెపిలను వ్యతిరేకిస్తున్న మీ పార్టీ గత ఐదేళ్ళలో ప్రధాని నరేంద్రమోడీకి అండగా నిలబడి ఎందుకు మద్దతు పలికింది?” అనే ప్రశ్నకు ఎంపీ కవిత సమాధానం చెపుతూ, “కేంద్రప్రభుత్వం దేశం మొత్తానికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొన్నప్పుడు, దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయగలమే కానీ దానిని ఆపగలిగే శక్తి మాకు లేదు. నోట్లరద్దు, జిఎస్టీ వంటివి అటువంటి నిర్ణయాలే. వాటిని అమలుచేయాలని కేంద్రం నిర్ణయం తీసేసుకొన్నాక రాష్ట్రాలు కూడా దానిని అమలుచేయడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. ఆ నిర్ణయాలను అమలుచేయక తప్పదాని తెలిసినప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ ప్రజలలో గందరగోళం సృష్టించడం కేసీఆర్‌కు ఇష్టం లేదు. కనుక వాటి అమలులో ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులను ఏవిధంగా తగ్గించవచ్చో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకొన్నారు. నోట్లరద్దు సమయంలో ఏటిఎంలలో డబ్బులు ఉండేవి కావు. వెంటనే ఆర్బీఐతో మాట్లాడి రెండు దఫాలుగా రూ.600 కోట్లు రప్పించుకొని రాష్ట్రంలో విడుదల చేయించాము. అలాగే జీఎస్టీ అమలు విషయంలో కూడా రాష్ట్ర సమస్యలు, అవసరాల గురించి కౌన్సిల్ సమావేశాలలో గతిగా మాట్లాడి కొంతవరకు సత్ఫలితాలు రాబట్టగలిగాము. ఆ కారణంగానే దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నూటికి నూరుశాతం జిఎస్టీ విధానం చక్కగా అమలవుతోంది. కేంద్రాన్ని ఆపగలిగే శక్తి మనకు లేనప్పుడు అది తీసుకొనే నిర్ణయాల వలన ప్రజలకు కలిగే ఇబ్బందులను తగ్గించడమే మనం చేయగలము. సిఎం కేసీఆర్‌ అదే చేశారు,” అని చెప్పారు. 

“రాఫెల్ వ్యవహారంపై అందరూ స్పందించినప్పుడు తెరాస ఎందుకు స్పందించలేదు?” అనే ప్రశ్నకు “అటువంటి పనికిమాలిన వ్యవహారాలపై మాట్లాడటం వలన ఏమి ప్రయోజనం? బోఫర్స్ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీని బిజెపి విమర్శిస్తే, అందుకు ప్రతిగా రాఫెల్ కుంభకోణంలో బిజెపిని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. రాజకీయ కారణాలతో ఆ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకొంటుంటే వాటిలో మేమేందుకు జోక్యం చేసుకోవాలి? మేమెప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల సమస్యలు, అవసరాల గురించి మాత్రమే మాట్లాడుతుంటాము. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని, హైకోర్టు విభజన చేయాలని, రాష్ట్రానికి రావలసిన నిధులను విడుదల చేయాలని కోరుతూ మేము పార్లమెంటులోపలా బయటా కేంద్రప్రభుత్వంతో చాలా పోరాటాలు చేసీనా సంగతి అందరికీ తెలుసు,” అని సమాధానం చెప్పారు.


Related Post