తెరాసకు బిజెపి ప్రత్యామ్నాయమైతే...

March 20, 2019


img

బిజెపిలో చేరిన డికె అరుణ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ్యించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో..దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనమవుతోందని, రాష్ట్రంలో బిజెపికి మాత్రమే తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగే శక్తి ఉందని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కేవలం ఒకే ఒక సీటు గెలుచుకోగా, తెరాస ప్రభంజనాన్ని తట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ 19 సీట్లు గెలుచుకోగలిగింది. అంటే రాష్ట్రంలో తెరాసకు కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా నిలబడిందని అర్ధమవుతోంది. అందుకే కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని పావులు కదుపుతున్నారని, ఆ కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని డికె అరుణతో సహా అందరికీ తెలుసు. 

రాష్ట్రంలో బిజెపికి ఒకప్పుడు చాలా బలం ఉన్నమాట నిజమే. కానీ  తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో బిజెపి క్రమంగా బలహీనపడుతూనే ఉంది. ఆ విషయం గ్రేటర్ ఎన్నికల నుంచి ఇతేవాల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతీసారి రుజువావుతూనే ఉంది. 

కనుక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడినంత మాత్రన్న బిజెపి బలపడినట్లు భావిస్తే అది ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. ఒకవేళ తెరాసకు బిజెపియే ఏకైక ప్రత్యామ్నాయమై ఉంటే కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని కాక బిజెపిపైనే ముందు దృష్టిపెట్టి ఉండేవారు. డికె అరుణ చెపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడినందున ఇప్పుడు రాష్ట్రంలో బిజెపి బలపడగలదనుకొంటే, దానికీ కేసీఆర్‌ ట్రీట్మెంట్ ఇవ్వకమానరు. బిజెపికి తెరాసను సవాలు చేసి డ్డీకొట్టి ఓడించగల శక్తి లేదని కేసీఆర్‌ భావించడం వలననే ఇంతకాలం దానిని ఉపేక్షించారని చెప్పవచ్చు. అయినప్పటికీ సిఎం కేసీఆర్‌ చాలా తెలివిగా ఎన్నికల వరకు ప్రధాని నరేంద్రమోడీతో దోస్తీ కొనసాగిస్తూ రాష్ట్ర బిజెపి నేతల చేతులు, నోళ్ళు కట్టేశారు. సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ‘ఫిరాయింపులతో’ హ్యాండిల్ చేస్తే, బిజెపిని ‘మోడీతో స్నేహం’ ద్వారా హ్యాండిల్ చేశారని చెప్పవచ్చు. కనుక తెరాసకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బిజెపి ఎదిగే అవకాశం ఉందో లేదో డికె అరుణతో సహా బిజెపి నేతలే నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకొని తెలుసుకోవడం మంచిది.


Related Post