తెరాస లోక్‌సభ అభ్యర్ధులపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్‌

March 19, 2019


img

ఈరోజు నిజామాబాద్‌లో జరిగిన తెరాస ఎన్నికల ప్రచారసభలో సిఎం కేసీఆర్‌ తెరాస లోక్‌సభ అభ్యర్ధులపై స్పష్టత ఇచ్చారు. ఎల్లుండి అంటే గురువారంనాడు లోక్‌సభ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తానని చెప్పారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రజాలనుద్దేశించి మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను గెలిపించి మాపై నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు 16 సీట్లు ఇచ్చినట్లయితే రాష్ట్రం, దేశం అభివృద్ధికి కృషి చేస్తామని మాటిస్తున్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు దేశానికి ఏమి చేశాయని నేను అడిగితే ఆ పార్టీ నేతలు కోపంతో ఊగిపోతున్నారు. ఇన్ని దశాబ్ధాల పాలనలో దేశాభివృద్ధి కోసం ఏమి చేయవచ్చో వివరించి ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తే వారికి ఆగ్రహం కలుగుతోంది. 

రామజన్మభూమిపై మా వైఖరి ఏమిటని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నన్ను ప్రశ్నించినట్లు విన్నాను. రాజకీయనాయకులకు మత రాజకీయాలు చేయడం తప్ప మరేం పని లేదా? దేశాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచించవలసిన నేతలు రామజన్మభూమి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే శ్రుంగేరీ మఠాధిపతినో మరొకరినో అడితే పరిష్కారం చూపేవారు కదా?నేను దేశం రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మీరు మత రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు?ఇంతకు మించి మీరు మరేమీ ఆలోచించలేరా?” అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణతో పాటు దేశాభివృద్ధి జరగాలని కోరుకొంటున్నానని అందుకే జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటున్నానని కేసీఆర్‌ చెప్పారు. జాతీయ రాజకీయాలలోమన మాట నెగ్గలంటే మన చేతిలో 16 ఎంపీలు ఉండాలని, కనుక తెలంగాణ ప్రజలు విశాలదృక్పదంతో ఆలోచించి లోక్‌సభ ఎన్నికలలో తెరాసను భారీ మెజార్టీతో గెలిపించాలని సిఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Related Post