సొంత అభివృద్ధి కోసమే పార్టీ మారాడు: కోమటిరెడ్డి

March 19, 2019


img

కోమటిరెడ్డి సోదరులు కుటుంబ సభ్యునిలా భావించే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరడంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం భువనగిరిలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, “చిరుమర్తి లింగయ్యను ఇంతకాలం మా కుటుంబంలో ఒకరిగానే భావిస్తుండేవారం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే, మేము పట్టుబట్టి ఆయనకు టికెట్ ఇప్పించాము. నకిరేకల్ నుంచి ఆయనను గెలిపించడానికి కూడా మేము ఎంత కష్టపడ్డామో ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన కేసీఆర్‌ ఇచ్చే డబ్బుకు ఆశపడి మాకు.. టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెరాసలో చేరిపోయారు. ఆయన ఈవిధంగా చేస్తారని మేము కలలో కూడా అనుకోలేదు. ఆయన చేసిన పనికి మేము చాలా బాధపడ్డాము.

నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నానని చెప్పడం అబద్దం. పార్టీ మారేందుకు నిశ్చయించుకొన్న రెండు వారాలలోపే ఆయనకు రూ.6 కోట్లు ఏవిధంగా సంపాదించుకోగలిగారు? అంటే ఆయన నియోజకవర్గం అభివృద్ధి కోసం చేరినట్లా లేక తన సొంత అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించినట్లా? అటువంటి నమ్మకద్రోహం చేసిన వ్యక్తికి, ఆయనను అందుకు ప్రోత్సహించిన పార్టీకి లోక్‌సభ ఎన్నికలలో జిల్లా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. ఎవరు ఎటు పోయినా మా కోమటిరెడ్డి సోదరులిద్దరం జిల్లాను విడిచిపెట్టము. జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము,” అని అన్నారు.


Related Post