ఉత్తమ్ రిస్క్ తీసుకొంటున్నారా?

March 16, 2019


img

కాంగ్రెస్‌ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్ధులలో 9 మంది అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినవారు కూడా ఉన్నారు. వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. అయితే ఆయన హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నారు. అది కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయామో లేక ఆయన కోరిక మేరకే టికెట్ లభించిందో తెలియదు కానీ పోటీ చేస్తున్నారు. 

ఒకవేళ ఈ ఎన్నికలలో గెలిస్తే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి లోక్‌సభకు వెళ్లిపోతారు. ఆయన లోక్‌సభ ఎన్నికలలో గెలిచి డిల్లీ వెళ్లిపోతే హుజూర్ నగర్ సీటు ఖాళీ అవుతుంది. ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దానిని మళ్ళీ దక్కించుకోలేకపోవచ్చు. 

ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతే యధాప్రకారం ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు కానీ ఇప్పటికే ఆయన నాయకత్వాన్ని పార్టీలో అనేకమంది ప్రశ్నిస్తున్నారు కనుక అప్పుడు తప్పనిసరిగా తన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసిరావచ్చు. అంటే ఆయన గెలిచినా ఓడినా పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయకతప్పదని స్పష్టం అవుతోంది. 

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో 16 సీట్లు తామే గెలుచుకొంటుందని తెరాస నమ్మకంగా చెపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఘనవిజయం నేపద్యంలో లోక్‌సభ ఎన్నికలలో కూడా తెరాస అత్యధిక స్థానాలు దక్కించుకోవచ్చుననే భయంతోనే కాంగ్రెస్ పార్టీలో కొమ్ములు తిరిగిన సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ వంటివారు పోటీ చేసేందుకు వెనకడుగు వేశారు. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీకి సిద్దపడి రిస్క్ తీసుకొంటున్నారనే చెప్పవచ్చు. 

ఈ ఎన్నికలలో తెరాస చేతిలో ఓడిపోయినట్లయితే వ్యక్తిగతంగా ఆయనకు, రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీకి కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటివారికి మాత్రం ఇది రెండవ అవకాశమే. ఈ ఎన్నికలలో వారు గెలిస్తే అదృష్టమే లేకున్నా కొత్తగా నష్టపోయేది ఏమీ ఉండదు. 


Related Post