ఫెడరల్‌ ఫ్రంట్‌కు బదులు జాతీయపార్టీ?

March 19, 2019


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ వ్యూహాలు కొమ్ములు తిరిగిన రాజకీయనాయకులకు కూడా అర్ధంకావని అనేకసార్లు రుజువయింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తానని గత 3-4 నెలలుగా చెపుతూ వచ్చిన సిఎం కేసీఆర్‌ మొన్న కరీంనగర్‌ సభలో జాతీయపార్టీ స్థాపిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అది కూడా లోక్‌సభ ఎన్నికల తరువాత స్థాపించాలనుకొంటున్నట్లు చెప్పడంతో ప్రతిపక్షాలు సైతం అయోమయానికి గురయ్యాయి. సిఎం కేసీఆర్‌ స్వయంగా జాతీయపార్టీ స్థాపిస్తానని ప్రకటించారు కనుక ఇక నుంచి తెరాస నేతలందరూ ఫెడరల్‌ ఫ్రంట్‌ను పక్కనపెట్టి జాతీయపార్టీ స్థాపన అవసరం.. దాని ప్రాముఖ్యత గురించి కోరస్ పాడటం మొదలుపెట్టవచ్చు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అప్పుడే ఆ పాట మొదలుపెట్టేశారు కూడా. 

తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెరాస నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “డిల్లీ రాజకీయాలలో ఎప్పుడు ఏవిధంగా పావులు కదపాలో సిఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. జాతీయపార్టీ ఏర్పాటుపై సిఎం కేసీఆర్‌ దేశంలో మేధావులతో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత జాతీయపార్టీ ఏర్పాటుపై స్పష్టత రావచ్చు. జాతీయ పార్టీలకు వచ్చే ఓట్లు, సీట్ల కంటే తెరాసకే ఎక్కువ ఓట్లు, సీట్లు వస్తున్నప్పుడు తెరాస జాతీయపార్టీగా ఏర్పడితే తప్పేముంది,” అని అన్నారు.


Related Post