యువత రావాలంటారు...వస్తే బచ్చగాడివంటారు: క్రిశాంక్‌

March 18, 2019


img

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓయూ విద్యార్థి నేత క్రిశాంక్‌ కాంగ్రెస్‌ టికెట్ కోసం చాలా ప్రయత్నించారు కానీ లభించకపోవడంతో రెబెల్ అభ్యర్ధిగా తన మావగారైన సర్వే సత్యనారాయణపైనే పోటీకి సిద్దం అయ్యారు. కానీ కాంగ్రెస్‌ పెద్దలు నచ్చజెప్పడంతో క్రిశాంక్ పోటీ నుంచి తప్పుకొన్నారు. ఆ సందర్భంగా క్రిశాంక్ కు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కనుక ఇప్పుడు తనకు టికెట్ కేటాయించమని క్రిశాంక్ పట్టుబడుతున్నారు. కానీ ఈసారి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హ్యాండ్ ఇవ్వడంతో క్రిశాంక్ తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి, కార్యదర్శి పదవులకు రాజీనామాలు చేయడమే కాకుండా, ఎన్నికల ప్రచారం కోసం సిద్దం చేసుకొన్న ప్రచార సామాగ్రికి నిప్పుపెట్టి తగులబెట్టి తన నిరసన, ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా క్రిశాంక్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేశారు.  క్రిశాంక్ ఏమి చెప్పారంటే “అసెంబ్లీ ఎన్నికలప్పుడు నాకు టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. లోక్‌సభ ఎన్నికలలో టికెట్ ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారు. రాజకీయాలలోకి యువత రావాలని ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ వచ్చి టికెట్ అడిగితే బచ్చాగాడివని అవహేళన చేస్తుంటారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా పార్టీ సమావేశాలకు ఫంక్షన్ హాల్స్, గార్డెన్స్ ఏర్పాటు చేయాలంటూ నాకు ఫోన్లు చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాకు ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు. నేను నా పదవులకు రాజీనామాలు చేసినప్పుడు కనీసం ఫోన్ చేసి కారణం అడగాలనిపించలేదా? ఇంతకాలం చాలా ఓపికగా ఎదురు చూశాను కానీ పార్టీలో నాకు అడుగడుగునా అవమానాలు, అన్యాయమే జరుగుతోంది. మీరు టికెట్ ఇస్తానని చెప్పినందునే రూ.15 లక్షలుపెట్టి ఎన్నికల ప్రచార సామాగ్రిని సిద్దం చేసుకొన్నాను. కానీ టికెట్ ఇవ్వరని స్పష్టం అయ్యింది కనుక దానిని పెట్రోల్ పోసి తగులబెట్టేసుకొంటున్నాను. మీరుండగా పార్టీలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకామ్ కోల్పోయాను. కనుక పార్టీలో కొనసాగాలనుకోవడం లేదు. మీ వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టింది. ఇంకా మీ చేతిలోనే పార్టీ నడిస్తే రాష్ట్రంలో పార్టీ ఇక ఎంతో కాలం మనుగడ సాగించలేదు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు యువనేత క్రిశాంక్.


Related Post