అసలైన ఆమాద్మీ మనోహర్ పారిక్కర్

March 18, 2019


img

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ (63) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కేంద్రప్రభుత్వం సోమవారం సంతాపదినంగా ప్రకటించింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశించింది. ఈరోజు సాయంత్రం పాణాజీలో అధికారిక లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

దేశంలో అనేకమంది ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఉన్నారు. కానీ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ వారందరి కంటే ప్రత్యేకమైనవారు. ఆ కారణంగానే ప్రధాని నరేంద్రమోడీ ఆయనను ఏరికోరి రక్షణమంత్రిగా నియమించుకొన్నారు. మూడేళ్ళపాటు అంచనాలకు మించి విశేషసేవలందించిన మనోహర్ పారిక్కర్, గోవాలో బిజెపి ప్రభుత్వం సంకట పరిస్థితిలో చిక్కుకోవడంతో మళ్ళీ గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయనకు క్యాన్సర్ వ్యాధి బారినపడి తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం కన్ను మూశారు.

మనోహర్ పారిక్కర్ నేటి రాజకీయనాయకులకు పూర్తి భిన్నమైనవారు. వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా గోవాను పాలించిన ఆయన ఏనాడూ ఆడంబరం ప్రదర్శించలేదు. గోవాలో మైనింగ్, లిక్కర్, డీజిల్, పెట్రోల్ మాఫియాలను కట్టడి చేసిన ఘనుడు. అయినా తన భద్రత కోసం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరిగా భారీ కాన్వాయ్ లను ఉపయోగించుకోలేదు. కాలికి హవాయి చెప్పులు వేసుకొని రోడ్డుపై వెళ్ళేవారిని లిఫ్ట్ అడిగి వారి బైక్ పై తన కార్యాలయానికి చేరుకొన్న సందర్భాలు కోకొల్లలు. 

మనోహర్ పారిక్కర్ సామాన్య ప్రజలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. గోవా చిన్న రాష్ట్రమైన కారణంగా తరచూ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తుండేవారు ఆ కారణంగా తరచూ ప్రభుత్వాలు  కూలిపోతుండేవి. అటువంటి అస్థిరరాజకీయాలను సరిచేసి మనోహర్ పారిక్కర్ చాలా సుస్థిరమైన పారదర్శకమైన పాలన అందించారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన విధంగా గోవాను పరిపాలించారు. అందుకే గోవా ప్రజల దృష్టిలో ఆయన ఒక రాజకీయ దేవుడుగా కీర్తింపబడుతున్నారు. 

ప్రజల పట్ల ఎంతో ఔదార్యంగా, స్నేహపూర్వకంగా ఉండే మనోహర పారిక్కర్ తన ప్రభుత్వంలోని అవినీతి అధికారులు, అవినీతిపరులైన మంత్రుల పట్ల చాలా కటినంగా వ్యవహరించేవారు. గోవా ప్రజల పాలిట దేవుడిగా ఉండే ఆయన అవినీతిపరుల పాలిట సింహస్వప్నంగా ఉండేవారు. ప్రతిపక్షపార్టీల నేతలతో పాటు అధికార పార్టీ నేతల అవినీతి చరిత్రల తాలూకు రికార్డులు ఆయన వద్ద ఉండేవి. కనుక ఎవరూ తోక జాడించడానికి సాహసించేవారు కారు. 

రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ చాలా నిరాడంబరంగా జీవిస్తూ ప్రజలలో ఒకరిగా కలిసిపోయేవారు. ఆయన రక్షణమంత్రిగా వ్యవహరించినప్పుడు, క్షేత్రస్థాయిలో పనిచేసే జవాన్లు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారి అవసరాలు ఏమిటో తెలుసుకొనేందుకు, వీలు చిక్కినప్పుడల్లా వారితో కలిసి టీ త్రాగుతూ మాట్లాడుతుండేవారు. ఆయన వ్యక్తిగతంగా చొరవ తీసుకొని కృషి చేయడం వలననే దశాబ్ధాలుగా అమలుకు నోచుకోని ‘వన్ ర్యాంక్- వన్ పింఛన్’ విధానం అమలవుతోంది. మంచి సమర్ధుడైన రాజకీయ నాయకుడికి నిజాయితీ, ప్రజలకు సేవ, రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన కూడా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మనోహర్ పారిక్కర్ వంటివాడు అని చెప్పుకోవచ్చు. 


Related Post