అవసరమైతే జాతీయపార్టీ స్థాపిస్తా: కేసీఆర్‌

March 18, 2019


img

సిఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి జాతీయరాజకీయాలలో ప్రవేశించబోతున్నట్లు చెపుతున్నారు. కానీ ఆదివారం రాత్రి కరీంనగర్‌లో జరిగిన తెరాస ఎన్నికల శంఖారావ సభలో మొదటిసారిగా అవసరమైతే జాతీయపార్టీని స్థాపిస్తానని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం వివిద రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను సంప్రదించి అందరినీ ఒక్క త్రాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకొంటానని చెప్పారు. అవసరమైతే జాతీయపార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. 

ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకొంటూ దేశం పరువు తీస్తున్నారని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దశాబ్ధాలుగా పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించకుండా, దేశాభివృద్ధి కోసం గట్టిగా కృషి చేయకుండా కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ పనికిమాలిన రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బిజెపిలను తరిమికొడితే కానీ ఈ దేశం బాగుపడదని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

దేశంలో అపారమైన మానవ, సహజ వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగించుకోలేకపోవడానికి కారణం కాంగ్రెస్‌, బిజెపి నేతల అసమర్ధత, అలసత్వమేనని సిఎం కేసీఆర్‌ అన్నారు. ఐదేళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించి రాష్ట్రాని ఏవిధంగా అభివృద్ధి చేసి చూపామో అదే విధంగా దేశాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తానని సిఎం కేసీఆర్‌ అన్నారు. ఒక దేశపౌరుడిగా దేశాన్ని బాగుచేసుకొనే ప్రయత్నంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టానని, తన ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించాలని సిఎం కేసీఆర్‌ కోరారు. 

కేసీఆర్‌ చేసిన జాతీయపార్టీ స్థాపన ప్రతిపాదన ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే, అధికార దాహంతో అలమటించిపోతున్న ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేసినప్పటికీ అది కప్పల తక్కెడగానే మిగిలే అవకాశాలే ఎక్కువ. కనుక కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాల మాదిరిగా సిఎం కేసీఆర్‌ కూడా జాతీయపార్టీని స్థాపించి, దానిని ‘తెరాస అంత’ బలోపేతం చేయగలిగితేనే ఆయన చెపుతున్న ‘గుణాత్మకమైన మార్పు’ సాధ్యం అవుతుంది. 

కానీ దక్షిణాదికి చెందిన ఒక నేత సారధ్యంలో ఏర్పాటయ్యే జాతీయపార్టీకి ఉత్తరాది ప్రజల ఆమోదం పొందడం దాదాపు అసంభవమేనని చెప్పవచ్చు. ఒకవేళ ఉత్తరాది ప్రజలను మెప్పించగలిగినా, కేసీఆర్‌ స్థాపించబోయే పార్టీ వలన ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయపార్టీలకు రాజకీయంగా తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది కనుక అవి దానిని తప్పకుండా అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చు. 

ఉదాహరణకు తెరాసను గద్దె దించేందుకు కాంగ్రెస్‌, టిడిపిలు ప్రయత్నించినప్పుడు తెరాస వాటిని అడ్డుకోగా, ఏపీలో టిడిపిని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్న తెరాస-వైసీపీలను అడ్డుకొనేందుకు టిడిపి ఇప్పుడు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ కేసీఆర్‌ జాతీయ పార్టీని స్థాపించి ఇతర రాష్ట్రాలలో దానిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తే అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా ఇదేవిధంగా దానిని అడ్డుకోవడం ఖాయం. అంటే జాతీయపార్టీ అయినా ఫెడరల్‌ ఫ్రంట్‌ అయినా తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలను కలుపుకొనే కేసీఆర్‌ ముందుకు సాగాల్సి ఉంటుందన్న మాట! 


Related Post