ఇంతకీ తెలంగాణకు కేంద్రం సహకరించిందా లేదా?

March 16, 2019


img

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయసహకారాల విషయంలో తెరాస చేస్తున్న వాదనలు పరస్పరవిరుద్దంగా ఉండటం విశేషం. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని వాదిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంతో కోట్లాడి చాలా సాధించుకొచ్చామని వాదిస్తోంది. 

తెరాస ఎంపీ కవిత నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “విభజన హక్కులను సాధించుకోవడానికి మేము డిల్లీలో కేంద్రమంత్రులు, సంబందితశాఖల అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి ఎయిమ్స్ ఆసుపత్రి, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కేటాయింపులు వంటివి సాధించుకొన్నాము. కేంద్రంతో కోట్లాడి నిజామాబాద్‌ రైల్వేలైనుకు నిధులు మంజూరు చేయించుకొన్నాము,” అని అన్నారు. 

కేంద్రంతో కొట్లాడి సాధించుకొన్నామని తెరాస నేతలు చెప్పుకొంటున్నారంటే, వాటిన్నిటినీ కేంద్రం ఇచ్చిందనే కదా అర్ధం. అటువంటప్పుడు కేంద్రం అసలేమీ చేయలేదని వాదించడం ప్రజలను తప్పు దారి పట్టించడమే కదా?

నిజానికి కేంద్రం అందిస్తున్న నిధులతో తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలలో అనేక సంక్షేమ పధకాలు, అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. వాటి గురించి చెప్పుకోవడంలో రాష్ట్ర బిజెపి నేతలు అలసత్వం ప్రదర్శించడం వలననే తెరాస, టిడిపివంటి ప్రాంతీయ పార్టీలు వాటిని తమ సొంత పధకాలుగా చెప్పుకొని రాజకీయ లబ్ది పొందుతుంటాయి. 

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య లేదా కేంద్రంలో...రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల అధినేతల మద్య సత్సంబంధాలు  ఉన్నట్లయితే, ఆయా రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాల కంటే ఎంతో కొంత అదనపు ప్రయోజనం లభించడం సహజమే. ఒకప్పుడు చంద్రబాబు-ప్రధాని మోడీకి మద్య సత్సంబంధాలు ఉండేవి. అందుకే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేశారు. అదే సమయంలో కేసీఆర్‌ నిత్యం కేంద్రంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వేవారు. కేంద్రంపై కయ్యానికి కాలు దువ్వినప్పుడు కేంద్రం మనకు సహకరించలేదని నిందించడం అనవసరం.

ఆ తరువాత సీన్ రివర్స్ అయ్యి చంద్రబాబు-ప్రధాని మోడీ మద్య శతృత్వం, ప్రధాని మోడీ-కేసీఆర్‌ మద్య స్నేహం ఏర్పడింది. ఆ కారణంగా ఆంద్రాకు సంబందించిన అన్నిటికీ బ్రేకులు పడుతుంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన ప్రాజెక్టులకు శరవేగంగా అనుమతులు, నిధులు, ఎయిమ్స్ వంటి సంస్థలు మంజూరు అయ్యాయి. అంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య లేదా కేంద్రంలో...రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల అధినేతల మద్య ఉండే రాజకీయ సంబందాలు, అవసరాలను బట్టే పనులు జరుగుతుంటాయని స్పష్టం అవుతోంది. అది చాలా సహజం కూడా.

కనుక గుణాత్మకమైన మార్పు కోరుకొంటున్నవారు కేంద్రంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి అధికారంలోకి వచ్చినా సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పడాలని...ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పరిపాలన సజావుగా సాగాలని...దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకోవాలి. అవసరమైతే అందుకు మేమూ సహకరిస్తామని చెప్పాలి. కానీ అస్థిరమైన, ప్రాంతీయపార్టీల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేసే బలహీనమైన కేంద్రప్రభుత్వం ఏర్పడాలని కోరుకోవడం లేదా అలా జరుగబోతోందని వాదించడం సరికాదనే చెప్పాలి.

తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకోవాలనుకొంటే తమను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ఇంకా ఏవిధంగా కృషి చేస్తామో చెప్పుకొని ఓట్లు కోరితే సరిపోతుంది కానీ కేంద్రం మెడలు వంచి సాధించుకోవడం కోసం 16 సీట్లు కావాలని కోరడం సరికాదనే చెప్పాలి.

దేశంలో అన్ని రాష్ట్రాలకు రకరకాల పధకాలు, ప్రాజెక్టులు, సమస్యలు, డిమాండ్లు ఉంటాయి. కేంద్రం మరో ఆలోచన లేకుండా వాటన్నిటినీ ఆమోదించి, అడిగినంతా నిధులు మంజూరు చేయడం సాధ్యమేనా? సాధ్యం కాకపోతే రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపినట్లేనా? అని ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది.


Related Post