రేవంత్‌ రెడ్డికి సెకండ్ ఛాన్స్! కానీ...

March 16, 2019


img

సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లినందుకు కాంగ్రెస్‌ నేతలు చాలా విమర్శలు చేసినప్పటికీ, ఆ నిర్ణయమే ఇప్పుడు వారికి వరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలవగానే లోక్‌సభ ఎన్నికలు రావడంతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్‌ నేతలకు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు వెంటనే మరో అవకాశం లభించినట్లయింది. వారిలో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్‌ రెడ్డి కూడా ఒకరు.

శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలిజాబితాలో ఆయనకు మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. కానీ ఆయనకు మంచి పట్టున్న కొడంగల్ సొంత నియోజకవర్గంలోనే తెరాస అనుసరించిన ఎన్నికల వ్యూహాలకు ఎదురుదెబ్బ తిన్న రేవంత్‌ రెడ్డి, ఇప్పుడు ఏకంగా ఏడు శాసనసభ నియోజకవర్గాలు (మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికిందరాబాద్‌ కంటోన్మెంట్) కలిగిన మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఇంత తక్కువ సమయంలో పట్టు సాధించవలసి ఉంటుంది. అంతేకాదు షరా మామూలుగా తెరాస వ్యూహాలను ఎదుర్కొంటూ ముందుకుసాగవలసి ఉంటుంది. ఈ రెండు అగ్ని పరీక్షల తరువాత మల్కాజ్‌గిరి ప్రజలను ప్రసన్నం చేసుకొని వారి ఓట్లు పొందవలసి ఉంటుంది.

కనుక ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు మల్కాజ్‌గిరి సీటు లభించినంత మాత్రన్న సంబరపడితే కుదరదు. అసలు అగ్నిపరీక్షలు ఇప్పటి నుంచే మొదలవుతాయి. ఈ అగ్నిపరీక్షలలో రేవంత్‌ రెడ్డి నెగ్గితే ఆయన రాజకీయ జీవితం మళ్ళీ గాడిన పడుతుంది లేకుంటే అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంటుంది.


Related Post