న్యూజిలాండ్‌ కాల్పులలో గాయపడ్డ హైదరాబాద్‌వాసి

March 15, 2019


img

శుక్రవారం ఉదయం న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పులలో హైదరాబాద్‌లో అంబర్ పేటకు చెందిన అహ్మద్ జహాంగీర్ అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన సోదరుడు ఇక్బాల్ జహంగీర్ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని సహాయం అర్ధించారు. ఆసుపత్రిలో ఉన్న తన సోదరుడికి తోడుగా ఉండేందుకు తాను న్యూజిలాండ్‌ వెళ్ళడానికి వీసా ఏర్పాటుకు సహకరించవలసిందిగా కోరారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా వెంటనే స్పందిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి, భారత్‌ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు సహాయం ఆర్ధిస్తూ ట్వీట్ చేశారు. భారత్‌ విదేశాంగ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

కాల్పులలో 9 మంది భారతీయులు గల్లంతయ్యారని న్యూజిలాండ్‌ అధికారులు చెప్పడం వారు మరణించారని భావించాల్సి ఉంటుంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి తాను ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్‌ టారెంట్‌ (28) అని స్వయంగా చెప్పుకొన్నాడు. అతను జాత్యహంకారంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతనికి ముస్లింలపై అకారణంగా ద్వేషం పెంచుకొని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు కనుగొన్నారు. అతనికి న్యూజిలాండ్‌లో ఒక మహిళతో సహా నలుగురు సహకరించారు. వారు న్యూజిలాండ్‌ పోలీసులకు సజీవంగా పట్టుబడ్డారు.


Related Post