వివేకా హత్యపై వికృత రాజకీయాలు

March 15, 2019


img

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినట్లు పోస్ట్ మార్టం నివేదికలో దృవీకరించడంతో, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌ ప్రోద్భలంతో ఆదినారాయణ రెడ్డి ఈ హత్య చేయించి ఉండవచ్చునని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో తన తాత రాజారెడ్డి హత్య జరిగినప్పుడు, ఆ తరువాత తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు, ఇప్పుడు తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబునాయుడే అధికారంలో ఉన్నారని జగన్ అన్నారు. 

వైజాగ్ విమానాశ్రయంలో తనను కూడా హత్య చేయించడానికి చంద్రబాబునాయుడు కుట్ర పన్నారని కానీ అదృష్టవశాత్తు తప్పించుకొన్నానని జగన్ అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక తనను, తన కుటుంబాన్ని అంతం చేయడానికే చంద్రబాబునాయుడు ఇటువంటి నీచమైన హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. 

చంద్రబాబునాయుడు కనుసన్నలలో పనిచేసే డిజిపి...పోలీస్ అధికారుల చేసే దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ రాజకీయహత్యకు కారకులైన వారు ఎంత పెద్దవారైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తిలేదని దీనిపై చివరి వరకు పోరాడుతానని జగన్ అన్నారు. 

జగన్ చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణలతో అధికార టిడిపి ఆత్మరక్షణలో పడింది. కానీ టిడిపి నేతలు కూడా జగన్‌ను ధీటుగానే ఎదుర్కొంటున్నారు. 

ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే జగన్ ఈవిధంగా ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయాణరెడ్డి ఆరోపించారు. ఎంపీ సీటు విషయంలో వైఎస్ కుటుంబంలో భేధాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. జగన్‌కు శవరాజకీయాలు చేయడం అలవాటేనని, తన తండ్రిపోయినప్పుడు ఇలాగే చేసి భంగపడ్డారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఎక్కడ ఏమి జరిగినా తనను వేలెత్తి చూపడం జగన్‌కు అలవాటుగా మారిందని అన్యాయంగా తనపై ఆరోపణలు చేస్తే సహించబోనని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. 

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ జరిగిన ఈ ఊహించని పరిణామం ఏపీ రాజకీయాలను, ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. చివరికి ఈ హత్యారాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో, ఏ పార్టీని ముంచుతాయో, ఎవరిని కోర్టు బోనులో నిలబెడతాయో ఊహించడం కష్టమే.


Related Post