మన్మోహన్ కంటే మోడీయే సమర్ధుడు: కాంగ్రెస్‌ నేత

March 15, 2019


img

లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకొంటున్న సమయంలో 15 ఏళ్ళపాటు డిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కలిగిన సీనియర్ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్, బీజేపీకి సంతోషం, కాంగ్రెస్‌కు చాలా ఇబ్బంది కలిగించే మాటొకటి అన్నారు. 

ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “ఉగ్రవాద నిర్మూలనలో మన్మోహన్ సింగ్, నరేంద్రమోడీలలో ఎవరు సమర్ధంగా వ్యవహరించారు?” అనే ప్రశ్నకు సమాధానంగా “2008లో 26/11 ముంబైపై ఉగ్రవాదుల దాడులు చేసినప్పుడు, ఆ తరువాత మా ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించలేదని నేను అంగీకరిస్తున్నాను. ఉగ్రవాద నిర్మూలనలో మా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కంటే ప్రధాని నరేంద్రమోడీ చాలా సమర్ధంగా, చురుకుగా వ్యవహరిస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందడానికే నరేంద్రమోడీ మరికాస్త దూకుడుగా వ్యవహరిస్తూ హడావుడి చేస్తున్నారు,” అని అన్నారు.

లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందడానికే ప్రధాని నరేంద్రమోడీ దూకుడుగా వ్యవహరిస్తున్నారని షీలా దీక్షిత్ చెప్పడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి అనుగుణంగానే ఉంది. కానీ అదే సమయంలో ఉగ్రవాదుల దాడుల నుంచి దేశాన్ని కాపాడటంలో తమ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని, మోదీతో పోలిస్తే తమ ప్రధాని అసమర్ధుడని ఓ సీనియర్ కాంగ్రెస్‌ నేత స్వయంగా  చెప్పడం కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ఊహించుకోవచ్చు. అంతేకాదు...ఎన్నికల ప్రచారం ఊపందుకొంటున్న ఈ సమయంలో ఆమె బిజెపికి మంచి ఆయుధం అందించినట్లయింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతుండటంతో ‘మీడియా తన మాటలను వక్రీకరించిందని’ షీలా దీక్షిత్ సర్ధిచెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.


Related Post