రాహుల్ క్యాబినెట్...దానిలో కొండా మంత్రి!

March 15, 2019


img

రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడివెళ్లిపోవడంతో తీవ్ర షాకుకు గురైన కాంగ్రెస్‌ నేతలు, ఆ షాకు నుంచి తేరుకొని గురువారం గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో         మ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌), టి.రామ్మోహన్‌రెడ్డి (టీఆర్‌ఆర్‌), మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి మురళీకృష్ణ పాల్గొన్నారు. 

“కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఈ స్థాయికి ఎదిగిన సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడూ అధికారం, అనేక పదవులు అనుభవించారు. కానీ పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఆమె వెళ్లిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ లేదు. మళ్ళీ అందరం కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొంటాము. చేవెళ్ళ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న కొండావిశ్వేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే ఆయనకు రాహుల్ గాంధీ మంత్రివర్గంలో మంత్రి పదవి లభిస్తుంది. అప్పుడు ఆయన చేవెళ్ళ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారు,” అని కాంగ్రెస్‌ నేతలు చేపారు. 

సబితా ఇంద్రారెడ్డి పార్టీ వీడటంపై కాంగ్రెస్‌ నేతలు చెప్పిన మాటలను ఎవరూ తప్పుపట్టలేరు కానీ చేవెళ్ళ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే ఆయనకు రాహుల్ గాంధీ మంత్రివర్గంలో మంత్రి పదవి లభిస్తుందని, ఆయన కార్యకర్తల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పడం ఆలూ లేదు...చూలు లేదు... కొడుకుపేరు సోమలింగం అన్నట్లుంది. 

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. గెలిచినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారో లేదో తెలియదు. అయినా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోంటారో లేదో తెలియదు. చేవెళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే ఇవన్నీ జరగాలా? జరుగకపోయినా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ళ అభివృద్ధికి బాగానే కృషి చేస్తున్నారనే మంచి పేరుంది. అలాగే తన అనుచరులను కూడా బాగానే చూసుకొంటారనే  పేరుంది కదా?


Related Post